Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రిలో పూర్వవైభవం కోసం గ్రామ స్థాయి పోరాటాలపై దృష్టి
- క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం
- సీపీఐ(ఎం)ను దెబ్బతీయడానికే భద్రాచలం ముక్కలు
- 40 ఏళ్లకు పైగా ఎర్ర జెండాదే ఆధిపత్యం...!
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మన్యం కమ్యూనిస్టుల కంచు కోట...! 40 ఏళ్లకు పైగా ఎర్ర జెండాదే ఆధిపత్యం...! ముంపు విభజన పేరుతో కమ్యూనిస్టులపై పాలకుల కుట్ర...! అనూహ్య పరిణామాలతో ఓ అడుగు వెనక్కి వేసినా పడిలేచే కెరటం వలె మన్యంలో కమ్యూనిస్టులు ముందడుగు...! ప్రజల మధ్య నిలుస్తూ ప్రజా సమస్యలపై నిత్య పోరాటాలు...! ఏజెన్సీలో మళ్లీ ఎర్రజెండా రెపరెపలకై సిపిఐ(ఎం) వ్యూహాత్మక పయనం...! పాత పంథానే నమ్ముకొని గ్రామ స్థాయి పోరాటాలపై దృష్టి...! క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం గావించి మళ్లీ విజయబావుటా ఎగురవేసేందుకు రానున్న ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధమవుతోంది.
కమ్యూనిస్టుల కంచు కోట భద్రగిరి మన్యం
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచు కోట. నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ ఎర్రజెండా రెపరెపలే. 1978 నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలే ఇక్కడ విజయ బావుటా ఎగుర వేస్తూ వస్తున్నారు. 1978, 83లో సిపిఐ(ఎం) అభ్యర్థి ముర్ల ఎర్రయ్య రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసారు. 1985, 89, 94లో కుంజా బుజ్జి మూడేళ్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 1999, 2004, 2014లో సున్నం రాజయ్య ఎమ్మె ల్యేగా పని చేశారు .2004లో భద్రాచలం పార్లమెంటు స్థానా న్ని కూడా సీపీఐ(ఎం) దక్కించుకుంది. భద్రాచలం ఎంపీగా మీడియం బాబురావు ఆనాడు గెలుపొందారు. భద్రాచలం మన్యంలో దాదాపు 40 ఏళ్లకు పైగానే సిపిఎం ఎమ్మెల్యేలే గెలుస్తూ అప్రతిహార జైత్రయాత్ర కొనసాగించారు.
ముంపు విభజన పేరుతో కుట్ర
నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం ఏలుతున్న కమ్యూనిస్టులపై పాలకులు కుట్రలకు తెరలేపారు. కమ్యూనిస్టుల రాజ్యంగా వెలుగొందుతున్న భద్రాచలాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసారు. ప్రాంతాన్ని విభజిస్తేనే కమ్యూనిస్టుల జైత్ర యాత్రకు బ్రేకులు వేయొచ్చు అన్న కుటిల ఎత్తుగడలకు పూనుకున్నారు. అందుకు పోలవరాన్ని బూచిగా చూపి పాలకులు కమ్యూనిస్టులపై కత్తులు దూశారు. పోలవరంతో ఏజెన్సీ అతలాకుతలమవుతుందని, ఆదివాసీలు అన్యాయానికి లోనవుతారని ముందే గ్రహించిన సీపీఐ(ఎం) పోలవరం ముంపు తక్కువగా ఉండాలని, ఎక్కువ నష్టం జరగొద్దని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. 2007 జనవరి 29న సిపిఎం ఈ విషయంపై భద్రాచలంలో ఆందోళన నిర్వహిస్తుంటే ఆనాటి ప్రభుత్వం కాల్పులకు కూడా పాల్పడింది. పోలీస్ తుపాకీ తూటాలకు ఉద్యమకారులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనలో సీపీఐ(ఎం)కు చెందిన 78 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇందులో 12 మంది ఇప్పటికే మృతి చెందారు. ఇదిలా ఉండగా భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గ పేరును మార్చి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంగా చేశారు. ముంపు విభజన పేరుతో భద్రాచలం మన్యాన్ని మూడు ముక్కలుగా విభజించారు. కేవలం కమ్యూ నిస్టులను దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు కేంద్రం ఒడిగట్టింది.
భద్రాచలం పట్టణం తప్ప మండలం అంతా ఆంధ్రకు కలిపారు. కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలు కూడా ఆంధ్రాలో కలిపారు. ఈ నాలుగు మండలాలు కూడా సీపీఐ(ఎం)కు గుండెకాయ లాంటివి. కొత్త జిల్లాల పేరుతో తెరాస ప్రభుత్వం 2016లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. కమ్యూనిస్టులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో తరతరాలుగా పాగా వేసిన సీపీఐ(ఎం)ను దెబ్బతీయాలనే వ్యూహరచనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. పాలకుల కుట్రతో గత సాధా రణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ కాస్త వెనకంజ వేసింది. ఓటమిని గుణపాఠంగా తీసుకునే అలవాటు ఉన్న సీపీఐ(ఎం) గత నాలుగేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువైంది.
సీపీఐ(ఎం) మళ్లీ పాత పంథాలో పోరాటం
పేదల పార్టీగా భావించే సీపీఐ(ఎం) మళ్లీ పాత పంథాలో పోరాటం చేయాలని సంకల్పించింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళి విజయబావుటా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం మళ్లీ పూర్వ పాత పంథా ఎంచుకుంది. గ్రామస్థాయిలో పోరాటానికి పకడ్బందీగా ప్లాన్ రూపొందించింది. గ్రామంలో అపరిష్కృత సమస్యలపై నిత్యం పోరాటాలు చేయాలని, ప్రజల్లోనే ఎప్పుడూ నేతలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలలో ప్రజా పోరాటాలను విస్తృతం చేశారు. బూతు స్థాయిలో కూడా ఉద్యమాలను పటిష్ట పరిచారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా యాక్టివ్ గా చేశారు. రైతు పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోడు భూముల పట్టాల సమస్య ప్రధానంగా నెలకొనడంతో గిరిజన పక్షాన నిలబడి ఇందుకు సంబంధించిన ఉద్యమాలను చేపడుతున్నారు. అంతేకాకుండా గిరిజన, రైతు సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి అక్కడికక్కడే ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభన దశలో పార్టీ నాయకులు భద్రాచలం మన్యంలో కరోనా బాధితులకు అండగా నిలిచిన తీరు ముదావహం. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల మధ్య నిలిచారు. సొంత వాళ్లే దరికి రాని పరిస్థితుల్లో సిపిఎం నేతలు చివరి అంత్యక్రియలు కూడా నిర్వహించిన తీరు ఇప్పటికీ ఏజెన్సీ ప్రజలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తున్నారు.
గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వివిధ కమిటీలను నెలకొల్పి వాటిని బలోపేతం చేస్తున్నారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం కన్వినర్ పోస్ట్ ను కూడా సృష్టించి, ఆ దిశగా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించేందుకు, పూర్వవైభవం దిశగా అడుగులు వేసేందుకు వ్యూహాత్మక ప్లాన్ రూపొందించి అమలు చేస్తోంది. భద్రగిరి మన్యంలో ఎర్రజెండా రెపరెపలకై సిపిఎం నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.