Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
వానాకాలం సాగు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఏఐకెఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.పుల్లయ్య డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆ సంఘం మండల కమిటీ సమావేశం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ.. రైతు బంధు పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని, కౌలు రైతులకు కనీస రక్షణ కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో సాగు అవుతున్న భూమిలో 30 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కౌలు చట్టాలను అమలు చేస్తూ కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు అన్నింటికీ వర్తింపజేయాలి తెలిపారు. ప్రతీ రైతుకు వాయిదాలు పద్ధతి కాకుండా ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరి చేయాలని, రైతు బంధం డబ్బులు వారి ఖాతాల్లో వెంటనే జమ చేయాలన్నారు. 2011 కౌలు చట్టం ప్రకారం కౌలు దారులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలన్నారు. రైతు భీమా, రైతు బందు, పంటల భీమా, రుణమాఫీ కౌలు రైతులకు వర్తింప జేయాలన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి అని అన్నారు. ధరణీ లో లోపాలను ఉచితంగానే సవరించాలి.
పామాయిల్ తోటలు వేసిన రైతులకు అవసరమైన పరికరాలు (మట్టలు, గెలలు కటింగ్) డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసారు. ఈ సమస్యలు పరిష్కారం ఈ నెల 20న నిర్వహించే మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తగరం జగన్నాధం, కలపాల భద్రంలు పాల్గొన్నారు.