Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవిచంద్ర, పార్థసారథికి స్వాగత సన్నాహాలు
- రేపు జిల్లాలో అడుగిడనున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు
- నగరంలో ఎటుచూసినా గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, హౌర్డింగ్లే..
- పార్టీ శ్రేణులు.. ఆయా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ రాజ్యసభ నూతన సభ్యులుగా ఎన్నికై ఖమ్మం జిల్లాలో తొలిసారి అడుగిడుతున్న సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర( గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డిలకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో శనివారం అడుగిడనున్న ఎంపీల కోసం నగరంలోని వివిధ కూడళ్లను గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, ఎంపీల కౌటౌట్లు, హౌర్డింగ్లతో ముస్తాబు చేశారు. పార్టీ శ్రేణులు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గతనెల 18వ తేదీన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా వీరిద్దరి పేర్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేశారు. మరుసటి రోజే నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు మే 30న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి మే 25న నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుటుంబంతో కలిపి రూ.5,300 కోట్ల ఆస్తులను నామినేషన్లో పొందుపరిచిన ఆయన దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా గణతికెక్కారు.
వారేవా వద్దిరాజు...
స్వతహాగా మహబూబాబాద్ జిల్లా వాసైనప్పటికీ వ్యాపారరీత్యా ఖమ్మం జిల్లాలో అడుగిడిన వద్దిరాజు రవిచంద్ర అనతికాలంలోనే ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. స్థానికంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. గ్రాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఖమ్మం, వరంగల్‌లకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగానూ పనిచేస్తున్నారు. తెలంగాణ మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏపీ, నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మంచి సర్వీస్ మోటో ఉన్న గాయత్రి 2019లో టీఆర్ఎస్లో చేరారు. వివాద రహితుడిగా పేరున్న రవిని స్వాగతించేందుకు 'గులాబీ' శ్రేణులు గ్రూప్‌లకు అతీతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
సంపన్న 'సారథి'కి స్వాగతం కోసం...
దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా బండి పార్థసారథిరెడ్డి ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి రూ.5,300 కోట్ల ఆస్తులున్నట్లు ఆయన తన నామినేషన్లో పొందుపరిచారు. ఆయన ఆస్తులు ఎక్కువగా హెటిరో గ్రూప్‌లో షేర్లు, పెట్టుబడుల రూపంలో ఉన్నాయి. ఇక దేశంలోనూ సంపన్నుల జాబితాలోనూ 80వ స్థానంలో ఉన్న పార్థసారథి సైతం వివాదారహితుడనే పేరుంది. తన స్వగ్రామం కందుకూరు అభివృద్ధి కోసం పాటుపడిన పార్థసారథిరెడ్డి వ్యాపారవేత్తగా కాకుండా తొలిసారి ప్రజాప్రతినిధిగా గ్రామంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
'గులాబీ'మయం...
రాజ్యసభ నూతన ఎంపీల కోసం ఏర్పాటు చేసిన స్వాగతం తోరణాలు, ఫ్లెక్సీలు, హౌర్డింగ్‌లు, కౌటౌట్లతో ఖమ్మం గులాబీమయం అయింది. వరంగల్ క్రాస్‌రోడ్డు మొదలు కాల్వడ్డు, పాతబస్టాండ్, వైరారోడ్డు, జడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, శ్రీశ్రీ విగ్రహం వరకు వద్దిరాజు, పార్థసారథిలను స్వాగతిస్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీతో పాటు మున్నూరుకాపు సంఘం, గ్రానైట్ అసోసియేషన్, బీసీ తదితర సంఘాల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గనే అవకాశం ఉంది. స్వాగత ఫ్లెక్సీలపై కేసీఆర్, కేటీఆర్, మంత్రి పువ్వాడ అజరు చిత్రాలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరి ఫొటోలు ఉండటం గమనార్హం. గ్రూపులకు అతీతంగా సమష్టిగా వీరి స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయనేందుకు ఇది సంకేతంగా పలువురు అభివర్ణిస్తున్నారు.