Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరిజన రైతుల వ్యవసాయ అవసరాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పననకు ప్రతి పాదనలు పంపినట్టు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గిరిజన ఆవాసాలకు, వ్యవసాయ అవసరాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పనపై శుక్రవారం హైదరాబాదు నుండి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిష్టినా జడ్ చోంగు కలెక్టర్లు, ఐటీడీఏ, అటవీ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 257 ప్రాంతాలలో గిరిజన రైతులకు వ్యవసాయ అసరాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పనకు గుర్తించామని వాటిలో 236 ప్రాంతాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 21 ప్రాంతాలలో 6 ప్రాంతాలలో త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పనకు జిల్లా స్థాయి కమిటి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 2 చోట్ల త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పనకు అవకాశం లేనందున తిరస్కరించినట్టు చెప్పారు. 13 ప్రాంతాలు వన్యప్రాణుల జోన్లు ఉన్నందున పీసీసీఎఫ్‌కు ప్రతిపాదనలు పంపినట్టు ఆయన వివరించారు. అలాగే సింగిల్ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పనకు గుర్తించిన ఆరు ప్రాంతాలలో 5 ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం కల్పనకు తిరస్కరించినట్లు చెప్పారు. ఒక ప్రాంత వన్యప్రాణుల పరిధిలో ఉన్నందున అనుమతులు కోసం పీసీసీఎఫ్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. గిరివికాసం ద్వారా వ్యవసాయ అవసరాలకు నీటి సౌకర్యం కల్పనకు లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు మండలాల్లో బోర్లు వేయాల్సి ఉన్నందున ఐటిడిఏ, అటవీ, డిఆర్డిఓ, విద్యుత్ అధికారులతో సమన్వయ కమిటి సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న భూముల్లో బోర్లు వేయించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో భద్రాచలం నుండి ఐటిడిఏ పిఓ గౌతం, అటవీ అధికారి రంజిత్, విద్యుత్‌శాఖ ఎస్ఈ రమేష్, డిఈ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.