Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- గుడిపాడు గ్రామస్తులకు ఇండ్ల పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) ప్రదర్శన, ధర్నా, తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
గుడిపాడు ప్రజలకు సర్వహక్కులు ఏర్పడే వరకూ ఈ పోరాటం ఆగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గుడిపాడు గ్రామ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ భారీ ప్రదర్శన ధర్నా నిర్వహించారు. తొలుత బరపటి సీతారాములు స్తూపం నుండి బయలు దేరిన ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుడిపాడు గ్రామం ఇప్పటికిప్పుడు ప్రజలు ఆక్రమించుకున్నది కాదని 1986లో ఈ ప్రాంతంలో భూములను ఆనాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాములు మా ఊరికి వచ్చి ఆదివాసీ ప్రజలతో ఇల్లు కట్టించాలని తెలిపారు. గ్రామం ఏర్పడి సుమారు 40ఏండ్లు అయిందని ఆ గ్రామంలో కొందరికి ఇందిరమ్మ ప్రభుత్వం మంజూరు చేసిందని కట్టుకొన్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పారు. విద్యుత్ శాఖవారు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, స్కూల్, అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు అయినది, ఆ గ్రామం పెరుమీదే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చారని వివరించారు. ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనులను భయ బ్రాంతులకు గురిచేస్తూ దేవాదాయ శాఖ వారు ఇది ''మోక్ష వెంకటేశ్వర స్వామి'' గుడి భూమి అని మీరు అక్రమంగా ఆక్రమించి ఇళ్ళు కట్టుకొన్నారని మీరు ఖాళీ చేయాలని బేధిరింపులకు గురిచేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా నెలకు 200 చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారు. దాన్ని తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్తులందరికీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఇప్పుడున్న నివాస స్థలాలకు హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని, భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. తక్షణమే రేవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి పట్టాలు ఇవ్వాలని, ఇంటి నంబర్లు లేని వారికి ఇంటి నంబర్లు ఇవ్వాలని కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు రహీం, సత్యవాణి, సత్య, గుడిపాడు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.