Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ - బోనకల్
రావినూతల గ్రామంలో అనేక నిర్బంధాలను, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన యోధుడు మరీదు కృష్ణయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. రావినూతల గ్రామంలో మరీదు కృష్ణయ్య సంతాపసభ సోమవారం సిపిఎం రావినూతల గ్రామ కమిటీ కన్వీనర్ గుగులోతు పంతు అధ్యక్షతన జరిగింది. తొలుత కృష్ణయ్య చిత్రపటానికి పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మధిర రూరల్ మండల కార్యదర్శి మంద సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో పోతినేని సుదర్శన్‌రావు, పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రావినూతల గ్రామంలో సిపిఎం అభివృద్ధికి, ప్రధానంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహించాడని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు సిపిఎంను అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, అయినా కృష్ణయ్య మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారని అన్నారు. తొలితరం నాయకుడుగా ఉన్న కృష్ణయ్యతో తాను సిపిఎం ప్రారంభంలో కలిసి పని చేశానని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
బిజెపి ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకు వచ్చి దేశాన్ని, రక్షణ వ్యవస్థను నాశనం చేస్తుందని విమర్శించారు. రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను తీసుకుంటే అది దేశానికే ప్రమాదకరమని, వెంటనే అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలన్నారు ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వాళ్లే ఆ సంఘటన జరిగిందని, ఈ సంఘటన కు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. సామరస్యంగా పరిష్కారం చేయవలసిన సమస్యలను పాలకుల జటిలం చేస్తున్నాయని విమర్శించారు.
ఈ సంతాప సభలో సిపిఎం సీనియర్ నాయకులు ఎర్రగాని కోటయ్య, సిపిఎం రావినూతల శాఖా కార్యదర్శులు మందా వీరభద్రం, కొంగర భూషయ్య, మాజీ ఎంపిటిసి గండు సైదులు, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, నవ తెలంగాణ జాబ్ వర్కర్ బుక్యా కృష్ణ, సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, గూగులోతు నరేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు చెడే వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు దొండపాటి సత్యనారాయణ, కొమ్మినేని పిచ్చయ్య, బూర్గుల అప్పాచారి, పిల్లలమర్రి వెంకట అప్పారావు, ఏసుపోగు బాబు పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మరీదు పుల్లయ్య పాల్గొన్నారు.