Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాం సెట్ బంజరు (ఎర్రగుంట) చెరువు ఆక్రమణను తొలగించాలని సీపీఐ(ఎం) పాల్వంచ పట్టణ కార్యదర్శి దొడ్డా రవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ట్లో వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. 1952 సంవత్సరంలో అప్పటి భూ పట్టేదార్లుగా వున్న సీతారాం సెట్, జమాలపురం గోపాలరావుల మాగాణి భూమి నీటి వనరు కోసం 16 ఎకరాల స్వంత భూమి మరో 17 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం 33 ఎకరాల్లో చెరువు నిర్మాణం చేశారని తెలిపారు. చెరువు తూములు రాజమండ్రి నుండి గోదావరి నది పడవల ద్వారా బూర్గంపాడులోని గుమ్మురూ వరకు తెప్పించి అక్కడ నుండి ఎడ్ల బండ్లపై ఇక్కడకు తెప్పించి తూములు ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు మంగయ్య చెరువు నుండి లింక్ కెనాల్ కూడా ఏర్పాటు చేశారన్నారు. కాలక్రమంలో వారి భూములను అక్కడి గ్రామస్తులకు చెరువు నీటి వనరు చూపించి అమ్మినారని, అప్పటి నుండి గ్రామస్తులు ఆ చేరువు నీటి ద్వారా పంటలు సాగు చేసుకొంటూ జీవిస్తున్నారన్నారు. పాడి రైతులకు ఆ చేరువు ప్రధాన నీటి వనరుగా ఉందని, ఇప్పటికి 150 ఎకరాలు మాగాణి 100 మంది రైతులు సాగు చేస్తున్నారని, చెరువు పూడిక నిండగా ప్రభుత్వ నిధులు రూ.6 లక్షలతో రెండు సార్లు పూడిక తీపించారన్నారు. తెలంగాణా ఏర్పాటు తరువాత కూడ మిషన్ కాకతీయ పథకం కింద రూ.20 లక్షలు మంజూరు చేసి పనులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి చరిత్ర గల చెరువును ''చండ్ర వెంకటేశ్వర్లు''అను వ్యక్తి భూమి రికార్డుల్లో పట్టే దార్లుగా ఉన్న సీతారాం సెట్, జమాలపురం గోపాలరావు పేర్ల మీద ఉన్న పట్టాలను వారి వారసులదగ్గర కొన్నట్లుగా తప్పుడు పత్రాలతో తన పెరుమీదకు మార్పించుకొని కబ్జా చేసి చెరువుకు పెన్సింగ్ వేసి పూడ్చడానికి ప్రయత్నం చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొనగా నేను ''మాజీ మావోయిస్టు''ను నా జోలికి వస్తే చంపుతా..'' అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేయగా ఇరిగేషన్ అధికారులను కూడా బెదిరిస్తూ మీకు చేతనైంది చేసుకోండీ.'' అంటూ అధికారులను బెదిరిస్తున్నాడని, చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా చేసి పామాయిల్ సాగు చేస్తున్నాడని తెలిపారు. సాగులో లేని చెరువు భూమికి అధికారుల లాలూచీ, మభ్యపెట్టి రైతు బంధు పొందుతున్నాడు. ఇట్టి విషయాలపై మీరు విచారణ చేసి వారిపై తగుచర్యలు తీసుకొని చెరువును కాపాడాలని, రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.సత్య, వి.వాణి, తులసీ రామ్, బూర రామారావు, ఆరేపల్లి సత్యనారాయణ, నాగరాజు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.