Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలు ఏవి?
- పోడు రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్రంలో పోడు భూములపై ఆధారపడ్డ 31.78 లక్షల మంది గిరిజన సాగు దారులకు సాదారణ రైతులు మాదిరిగానే ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పధకాల అన్నింటిని వర్తింప చేయాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరు అయి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు సుమారు రెండు కిలోమీటర్లు రైతులు, పోడు సాగు దారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సాగుదారులు ఎదుర్కొంటున్న 28 రకాల సమస్యలపై తహశీల్దార్ చల్లా ప్రసాద్ వినతి పత్రం ఇచ్చారు. అక్కడ రైతులను ఉద్దేసించి ఐలయ్య మాట్లాడారు. గిరిజనులక అడవి భూములు, అడవులపై వచ్చే ఆదాయం తప్ప మరో ఆధారం లేదని ఆవేదన చెందారు. వీరి అభివృద్ధికి పార్లమెంట్లో వామపక్ష పార్టీల ఆందోళనల ఫలితంగా 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చారు అని తెలిపారు. అడవులలో ఉన్న ప్రతి కుటుంబానికి 10 ఎకరాల వరకు భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ చట్టం చెబుతుంది అని, ప్రభుత్వం దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులను భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఎద్దేవా చేసారు. పోలీసు, అటవీశాఖ నిర్భందం ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెడుతున్నారు అని వాపోయారు.
రాష్ట్రంలో వామపక్షాలు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఫలితంగా ప్రభుత్వం ధరఖాస్తు చేసుకుంటే, హక్కు పత్రాలు ఇస్తామని హామి ఇచ్చింది కానీ నెలలు గడుస్తున్న హక్కు పత్రాలు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ...
రాష్ట్రంలో 2,31,368 మంది అటవి హక్కుల చట్టం కింద 8,37,675 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఈ 8 ఏళ్ళ కాలంలో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించ లేదని అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి 94,278 ధరఖాస్తులును పరిష్కారం చేశారు అని, మిగిలిన వాటికి ఇప్పటికీ పరిష్కారం చూపలేదు వాపోయారు.
అటవీ అధికారులు అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తి వేయాలని, హక్కు పత్రాలు ఇవ్వాలని, వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని, 2014 జూన్ 2 ప్రాతిపదికగా అటవి హక్కుల చట్టం అమలు చేసి పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని, వన సంరక్షణ సమితులకు ఇచ్చిన పట్టాలు రద్దుచేసి ఆ భూమిపైనా పోడు సాగుదార్లకు హక్కు కల్పించాలని, అటవి హక్కుల చట్టం నీరుగార్చడానికి మోడీ ప్రభుత్వం ''నూతన అటవి విధానం 2019'' ద్వారా తెచ్చిన ప్రమాదకర సవరణలు రద్దు చేయాలని, పోడు సాగు దార్లందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ మాట్లాడుతూ..పోడు సాగు దార్ల సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు జూన్ 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మెయిన్ రోడ్లో లారీ అసోసియేషన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు జరిగే పోడు రైతుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గడ్డం సత్యనారాయణ, తగరం జగన్నాధం, నాయకులు కలపాల భద్రం తదితరులు పాల్గొన్నారు.