Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు ఇచ్చిన ఐబీ, ఫిషరిస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
- తహశీల్దార్‌కు రైతు సంఘం నాయకుల వినతి
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని లాలాపురం గ్రామంలో తాతలముత్తాల కాలం నుండి ఉన్న తుమ్మల చెరువుని ధ్వంసం చేసి చేపల చెరువుల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం చేపలు చెరువు నిర్మాణ పనులను స్థానిక రైతులతో కలిసి పరిశీలించి రాంబాబు మాట్లాడుతూ సాగు నీటి అవసరాల కోసం నైజాం పరిపాలన కాలంలో వంద సంవత్సరాల క్రితం చెరువు నిర్మాణం జరిగింద న్నారు. ఈ చెరువు అభివృద్ధి పనులు ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేశారు. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పటికీ కొందరు చెరువుని సాగుభూమిగా చూపి పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఐబీ, ఫీషర్సీ శాఖల నుంచి చేపల చెరువులు నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్నారన్నారు. నైజాం పరిపాలన కాలం నాటి చెరువులో చేపల చెరువులు నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన ఐబీ, ఫీషర్సీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అక్రమ చేపల చెరువులు నిర్మాణాల వల్ల సాగునీరు ఇబ్బందులతో పాటు, వాగులు వంకలు దారి మళ్లింపుతోపాటు రైతులు పంట భూములకు వరద ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా తహశీల్దార్ సైదులు మాట్లాడుతూ ఇప్పటికే రెవెన్యూ అధికారుల చేపలు చెరువులు నిర్మాణం పరిశీలించారని, అదేవిధంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రైతులకు హమీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విర మించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, గోపవరం సోసైటి డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, రైతులు సంక్రాంతి పురుషోత్తం, రమేష్, పాసంగులపాటి రమేష్, పాసంగులపాటి శ్రీనివాస్ రావు, ఎస్కె బాబు, దామా సీతారాములు , బ్రమ్మహెశ్వరావు, పుల్లయ్య, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.