Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠ్య పుస్తకాల అవసరం 23,495... వచ్చింది 3,677
- ఖాళీగా 51 ఉపాధ్యాయ పోస్టులు
- స్కావెంజర్ల పోస్టులన్నీ రద్దు
- పాఠశాలల మేనేజ్మెంట్ నిధులు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
- ప్రభుత్వ ఆంగ్ల విద్యపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు
నవ తెలంగాణ - బోనకల్
బోనకల్ మండలంలోని ఒక్కొక్క పాఠశాల ఒక రకమైన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తితో లేరు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా తమ పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
బోనకల్ మండలంలో పది ఉన్నత పాఠశా లలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 32 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 90 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 65 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 32 పాఠశాలల్లో 25 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 112 పోస్టులు ఉండగా 86 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల వ్యాప్తంగా 202 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 151 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల వ్యాప్తంగా 2,731 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. మండల వ్యాప్తంగా 23,495 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంది. కానీ పాఠశాల ప్రారంభమై వారం రోజుల గడుస్తున్నప్పటికీ కేవలం 3,677 పాఠ్య పుస్తకాలను మాత్రమే ప్రభుత్వం మండలానికి సరఫరా చేసింది. అయితే ఈ పుస్తకాలు కూడా గత ఏడాది పుస్తకాలే కావటం విశేషం. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. తెలుగు మీడియంలోనే విద్యాబోధనకు ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు ఎలా పంపించాలని బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ఉపాధ్యా యులు లేరు కదా అని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని ఇందుకోసం (బైలింగల్ మెథడ్) ఓకే పాఠ్యపుస్తకంలో ఒక పేజీలో తెలుగు మరోవైపు ఇంగ్లీష్ మీడియం ముద్రణ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు ఆ పాఠ్యపుస్తకాల జడ, అడ్రస్ లేదు. ఇదిలా ఉండగా మన ఊరు - మన బడి పేరుతో పాఠశాల మేనేజ్ మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఇటీవల పాఠశాలల వద్ద ఉన్న నిధులను వెనక్కు తీసుకుంది. మనబడి - మన ఊరు పథకంలో ఏడు ఉన్నత పాఠశాలను, ఎనిమిది ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 15 పాఠశాలలను ఎంపిక చేశారు. కానీ బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలకు మాత్రమే 58 వేల రూపాయలను విడుదల చేసింది. ఈ పాఠశాలలోనే మన ఊరు మన బడి కింద అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 14 పాఠశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు. 43 పాఠశాలలో ఉన్న స్కావెంజర్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, గ్రామ పంచాయతీ ద్వారా మల్టీ పర్పస్ వర్కర్లు ఆ పనులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు ఆ పనులు చేయటానికి నిరాకరిస్తున్నారు. తాము గ్రామ పంచాయతీ పనులు మాత్రమే చేస్తామని పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రం చేసే పనులు తాము చేయబోమని మల్టీపర్పస్ వర్కర్లు స్పష్టం చేశారు. దీంతో పాఠశాలలో మరుగుదొడ్లు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. కొన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలలకు తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని అందువల్లే తాము తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించ లేక ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: టీఎస్ యుటిఎఫ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు భూపతి ప్రీతం, గూగులోతు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 25వ తదీ వరకు మెయిల్ ద్వారా పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలలో మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో స్కావెంజర్ల పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం కనుగుణంగా ఉపాధ్యాయులను కూడా నియమించాలని కోరారు. స్కావెంజర్లు లేకపోవటం వలన ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యే ప్రమాదముందని వారిని వెంటనే నియమించాలని కోరారు.