Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు చర్యలు ఎప్పుడు..?
- గ్రామాల్లో రాత్రులకు రాత్రే డబ్బులు పంపిణీ..!
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని పెంట్లం గ్రామానికి చెందిన ఓ రైతు తమ భూమిని పట్టా చేయిస్తానని ఓ దళారి రూ.30వేలు తీసుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వరుసగా రెండవ రోజు పలువురు రైతులు బయటకు వచ్చారు. పట్టా పాస్ పుస్తకం ఇప్పిస్తానని ఎకరానికి సుమారు రూ.30వేలు వసూలు చేసి సంవత్సరాలు గడుస్తున్న ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు గురువారం పోలీసు స్టేషన్కు వచ్చారు. గత రెండు రోజులుగా పట్టా పాస్ పుస్తకాల వ్యవహారం వార్త పత్రికల్లో వరుస కథనాలు రావడంతో పలు గ్రామాల్లో వున్న భూ దళారులు రైతుల వద్దకు వచ్చి బుజ్జగించేపనిలో పడ్డారు. మా గురించి ఎవరికీ చెప్పవద్దు అని కొద్ధి రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తామని వారిని బుజ్జగిస్తున్నారని బాధిత రైతులు చెప్పకనే చెపుతున్నారు. మరి కొంత మంది దళారులు రాత్రికి రాత్రే రైతులు దగ్గర నుండి తీసుకున్న డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొన్ని గ్రామాల్లో అయితే మాకు తిరిగినందుకు ఖర్చులు అయ్యాయని ఇచ్చిన డబ్బులో సగం కోత పెట్టి ఇస్తున్నారని చర్చించుకుంటున్నారు. మరి కొంత మంది దళారులు మాత్రం ధరణిలో మార్పులు వస్తాయి, ఎన్నికల సమయం దగ్గర పడింది.., అందరకీ పట్టాలు చేస్తారని అమాయక రైతులను నమ్మిస్తున్నారు. ఏది ఏమైనా రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి రెవెన్యూ ధరణి వ్యవస్థ గురించి రైతులకు అవగాహన కల్పిస్తే దళారులు తీసుకున్న ధనం మొత్తం బయటకు వస్తుంది. లేని పక్షంలో వారు ఆర్థికంగా ఎంతో నష్టపోతారని మండలంలోని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోతే దళారులుతో మాట్లాడిన కాల్ రికార్డులు బహిర్గతం చేసి సాక్షాలు చూపిస్తామని బహిరంగంగానే అంటున్నారు.