Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయ నిర్మల
నవతెలంగాణ నేలకొండపల్లి
వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులు అదును చూసి విత్తు నాటుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయ నిర్మల అన్నారు. శుక్రవారం మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలోని రైతు వేదిక నందు క్లస్టర్ స్థాయి రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరిలో ఉన్న మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుని నార్లు పోసుకోవాలని తెలిపారు. ప్రధానంగా దీర్ఘకాలిక వరి రకాలను ఈ నెల చివరి వరకు నార్లు పోసుకోవాలని, మధ్య, స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు నార్ల పోసుకోవాలని తెలిపారు. వరిలో నాటే పద్ధతి కాకుండా నేరుగా వెదజల్లే పద్ధతి అత్యంత లాభదాయకంగా రైతులకు సౌలభ్యంగా కూడా ఉంటుందన్నారు. కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజరు చంద్ర మాట్లాడుతూ పత్తిలో చేయాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేసినారు. పాస్పరస్ ను కరిగించే బ్యాక్టీరియా వాడకం వలన కలిగే ఉపయోగాల గురించి, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్.వి.కె నారాయణరావు, ఏఈఓ బి సాయినిఖిల, రైతుబంధు గ్రామ కన్వీనర్ పిచ్చయ్య, బెల్లం పుల్లయ్య, సర్పంచ్ దండ పుల్లయ్య, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సొసైటీ వైస్ చైర్మన్ లు వాసు, అశోక్ రైతులు ఎలమద్ది లెనిన్, వీరబాబు, రంగారావు మరియు రైతులు పాల్గొన్నారు.
విత్తన ఎరువుల దుకాణాలు తనిఖీ
మండల కేంద్రంలోని విత్తన ఎరువుల దుకాణాలను శుక్రవారం కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజరు చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ వివరాలు ప్రతిరోజు సరిచేసుకోవాలని డీలర్లకు సూచించారు. దుకాణాలలో రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు వెంటనే రసీదును ఇవ్వాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి ఎస్వి కే.నారాయణరావు, విత్తన దుకాణాల డీలర్లు ఉన్నారు.
విత్తనాలు దుకాణాల్లో తనిఖీలు...
కూసుమంచి : కూసుమంచి గ్రామంలో విత్తన దుకాణాలను శుక్రవారం వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ సతీష్, ఏవో వాణీలు మాట్లాడుతూ... రైతులందరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద నుండి మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లును తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. అంతే కాకుండా గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే తక్షణమే వ్యవసాయ శాఖ వారికి లేదా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, ఎస్సై నందిప్, టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.