Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం, లోతువాగు రైతువేదికలో అసంక్రమిక వ్యాధుల ఇంటింటి సర్వే, సీజనల్ వ్యాధులు నియంత్రణ, గర్భిణిల నమోదు, సాధారణ ప్రసవాలు, పోషణ లోప నివారణ చర్యలు, పారిశుధ్య కార్యక్రమాలు తదితర అంశాలపై వైద్య, అంగన్వాడీ, పంచాయతీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంక్రమిక వ్యాధులను ముందే గుర్తించి వైద్యసేవలు అందించడం వల్ల సులభంగా వ్యాధులను తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారని చెప్పారు. బిపి, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధుల వ్యాధుల బారిన పడి ప్రజలు ఆర్ధికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కాన్సర్ వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తించడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఇంటింటి సర్వే ప్రక్రియను పూర్తి చేసి అసంక్రమిక వ్యాధులతో భాదపడుతున్న వారి జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. గత రెండు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 68 నుండి 74 శాతానికి పరిగినట్లు చెప్పారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 నుండి 22 శాతానికి తగ్గినట్లు చెప్పారు. పాలియేటివ్ కేర్ యూనిట్లో వైద్య సేవలు నిర్వహణపై ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్ అడిగి తెలుసుకున్నారు. వేలకు వేలు జీతం తీసుకుంటూ పనిచేయకపోతే ఉపేక్షించనని సస్పెండ్ చేస్తానని బూర్గంపాడు ఏసిడిపిఓ సలోమిని హెచ్చరిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. ప్రతినెలా సిడిపిఓలు 20 కేంద్రాలను తనిఖీ చేయాలని, తనిఖీ నివేదికను అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానందస్వామి, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిపిఓ రమాకాంత్, అన్ని మండలాల యంపిడిఓలు, సిడిపిఓలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.