Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో బాధితులు
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలో సింగరేణి ఏర్పాటు చేసిన ఓసిలో భూములు, ఇండ్లు కోల్పోయిన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని నిర్వాసిత బాధితులు కోరుతున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వాసితులు బాణోత్ రవి చంద్ర, ధారవత్ కైలాష్, భూక్య దేవి, మాలోత్ జామున, భట్టు రాంబాబు తదితరులు మాట్లాడారు. 19, 20, 21 వార్డులకు చెందిన జేకే 5 ఓపెన్ కాస్ట్ సింగరేణి గిరిజనుల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని ఇల్లందులోని బాటం ఫిట్ బస్తీకి చెందిన మాలోత్ దిలీప్ కుమార్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన గిరిజన యువకుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో సింగరేణి ప్రాజెక్టుల కోసం డిస్ప్లేస్ అయిన సుమారు 39 కుటుంబాలకు సింగరేణి కంపెనీలో శాశ్వత ఉద్యోగాలు సింగరేణి వారు కల్పించారని తెలిపారు. మొత్తం 104 కుటుంబాలకు ఉద్యోగాలకు అర్హత ఉన్నప్పటికీ కేవలం 39 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. మిగిలిన 65 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించి తమను ఆదుకోవాలని సింగరేణి అధికారులకు గిరిజన భూ నిర్వాసితులు తమ దరఖాస్తు ద్వారా కోరుకున్నారు. కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్లో తమ పేర్లు నమోదు అయ్యి ఉన్నప్పటికీ, ఉద్యోగాలకు అర్హత ఉన్నప్పటికీ న్యాయంగా తమకు రావలసిన ఉద్యోగాలు సింగరేణి అధికారులు ఇవ్వడం లేదని గిరిజన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ రివైజ్డ్ స్టాండర్స్ డేటా ప్రకారం నిర్వాసితులకు రావాల్సిన కూలీ వేతనాలను కనీస వేతనాల చట్ట ప్రకారం ఇవ్వకుండా అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చారని, ఉన్నతాధికారులు కనీసం ఇకనైనా స్పందించి తమకు న్యాయంగా రావలసిన ఉద్యోగాలు మంజూరు చేయాలని, అలాగే పెరిగిన కూలీ వేతనాలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాణోత్ హరి ప్రియ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే సింగరేణి అధికారులతో సమీక్ష జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.