Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
నత్రజని ఎరువుల దఫదఫాలుగా వినియోగించటం వల్ల ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి నాగినేని నాగ సాయి తెలిపారు. మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో రైతు శిక్షణా శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులలో రైతులకు పలు అంశాల గురించి వివరించారు. పచ్చి రొట్ట ఎరువులు (జీలుగ,జనుము, పిల్లిపెసర)సాగు చేయడం ద్వారా నేలకు సేంద్రియ పదార్ధం, హ్యూమస్ మరియు నత్రజని విలువలు పెరుగుతాయి.నేలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. నేల కోతను నివారించి, నేల పై పొరను రక్షిస్తుంది, వేర్లు బాగా వృద్ధిచెంది అట్టడుగు పోరలనుంచి పోషకాలను సంగ్రహించుకోగలుగుతాయని అన్నారు. ఒక ఎకరం భూమిలో పచ్చి రొట్ట కలియదున్నడం వలన ఎకరాకు సిఫార్సు చేసిన యూరియాలో ఒక బ్యాగ్ యూరియా తగ్గించుకోవచ్చు అన్నారు. భాస్వరాన్ని కరిగించే (పిఎస్బి) వాడకం ద్వారా పంట పెరుగుదలకు, వేర్లు వృద్ధి చెందడానికి దోహదపడతాయని తెలిపారు. ఈ జీవన ఎరువులను రెండు పద్ధతుల్లో భూమి పై జల్లడం ద్వారా, విత్తన శుద్ధి ద్వారా వినియోగించవచ్చునని తెలిపారు. దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చునని సూచించారు. సరైన దుక్కులు చేసుకొని ఎకరాకు 10-12 కేజీల విత్తనం చల్లుకోవాలని, సాధారణంగా వానాకాలం వర్షాలు వరి పంటకు సరిపోతాయని, కానీ వారం రోజులు కన్నా బెట్ట ఉంటే నీటి తడులు ఇవ్వాలన్నారు. ఈ పద్ధతి లో నారు మడి పెంచే ఖర్చు లేదా విత్తన మోతాదు సగానికి సగం తగించుకోవచ్చునని, ఎకరాకు 7వేల వరకు ఖర్చు ఆదా అవుతుందని, 25-30 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కేతినేని ఇందు, సహకార సంఘం అధ్యక్షులు బొజడ్ల పుల్లారావు, సంఘం సీఈవో గుడిద కృష్ణారావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.