Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజాపంపిణీ ద్వారా ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు రకరకాల మార్గాల్లో తరిలిపోతున్నాయి. చౌక దుకాణం ద్వారా పేదలకు లభించే ఉచిత బియ్యాన్ని అక్రమార్కులు వివిధ రూపాల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గత కొంత కాలంగా రోడ్డు మార్గాల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడ్డారు. రోడ్డు మార్గాలలో తనిఖీలు పెరిగి పోయాయి. పోలీసు, రెవిన్యూ అధికారుల దాడులు పెరిగాయి, కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రోడ్డు మార్గాలు అన్ని మూసుకుపోయిన ఈ క్రమంలో బియ్యాన్ని తరలించే అక్రమార్కులు రోడ్డు మార్గానికి స్వస్తి పలికారు. రైల్ మార్గాలు ఎన్నుకున్నారు. కొత్తగూడెం నుండి మహారాష్ట్రలోని బళ్ళార్ష వరకు రైలు మార్గం ద్వారా తరలించేందుకు ఎన్నుకున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కొత్తగూడెం నుండి బయలుదేరే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారు. కొత్తగూడెం, మహబూబాద్, కేసముద్రం, గార్ల, ఇంటికన్నె, తదితర ప్రాంతాల నుండి కొంత మంది అక్రమ బియ్యం మూటలు కట్టి రైల్లో వేస్తున్నారు. సాదా సీదా ప్రయాణికుల్లాగా బియ్యం బస్తాలతో రైలు ఎక్కుతున్నారు. మూటలుగా ఉంటే రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారని గమనించారు. కొత్త పంధా ఎన్నుకున్నారు. రైల్లో ఎక్కించిన బస్తాలలోని బియ్యాన్ని ప్రయాణికుల సీట్ల కింద మూటలుగా ఉన్న బియ్యాన్ని రైలు బోగిలో పారబోస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎవరికి అనుమానం రాదని ఇలా చేస్తున్నారు.ఈ విధంగా అక్రమంగా పేదలకు ప్రభుత్వం ఆందించే పీడీఎస్ రైస్ రైలులో రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయు. కింద పారబోసిన రైస్‌ను పోలీసులు స్వాదీనం చేసుకోరనే కోణంలో అక్రమార్కులు ఈ విధంగా రవాణా చేస్తున్నారు. చేరవలసిన గమ్యస్థానం వచ్చే ముందు వాటిని బస్తాల్లోకి ఎత్తుకుని చేరవలసిన వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే పోలీసులు వచ్చి ఈ బియ్యం బస్తాలు ఎవరివి అని ఆరా తీస్తే గుట్టుచప్పుడు కాకుండా రైలు దిగి ఉడాయిస్తున్నారని సమాచారం. తాజాగా కొత్తగూడెం రైల్వేపోలీసులు ఇదే తరహాలో అక్రమ రవాణాకు రైలు బోగిలో సిద్దంగా ఉన్న 53 క్వింటళ్లా పిడిఎస్ రైస్‌ను సాద్వీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇలా గుట్టు చప్పుడు కాకుండా తరలిపోతున్న బియ్యానికి రైల్వే పోలీసులు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.