Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక సాంద్రత పత్తితో అత్యధిక ఉత్పత్తి
- రాష్ట్రవ్యాప్తంగా 30-35వేల ఎకరాల్లో సాగు
- సాధారణ పద్ధతి కంటే 18వేల మొక్కలు ఎక్కువ
- ఎకరానికి 15 క్వింటాళ్ల వరకూ దిగుబడి
- పెట్టుబడి ప్రోత్సాహకంగా రూ.4వేలు
- ఖమ్మం జిల్లాలో 1150 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు
- అందుబాటులోకి నాటు, పత్తి తీత యంత్రాలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తక్కువ నెల...ఎక్కువ పంటే లక్ష్యంగా అధిక సాంద్రత పత్తి సాగుకు తెలంగాణ వ్యవసాయశాఖ ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేసింది. సాధారణ పద్ధతితో పోల్చితే ఈ సాగు విధానంలో రెండింతల దిగుబడి ఎక్కువగా వస్తుం దని అధికారులు చెప్తున్నారు. వరంగల్ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రయోగాత్మక సాగులో హైబ్రిడ్ బీటీ రకంలో ఎకరాకు 13-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నీటి సౌకర్యం ఉంటే 25 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంటు న్నారు. సాధారణ పద్ధతిలో రెండు, మూడుసార్లు పత్తి తీయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రయోగాత్మక విధానంలో పంట మొ త్తం ఒకేసారి కోతకు వస్తుంది. పంట కాలం కూడా తక్కువే. 150-160 రోజుల్లోనే పంట మొత్తం చేతికొస్తుంది.
ఎంపిక చేసిన రైతులతో సాగు...
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 30-35 వేల ఎకరాల్లో ఎంపిక చేసిన రైతులతో సాగు చేయిస్తున్నారు. ఖమ్మంలోని సింగరేణి, ముదిగొండ మండలాల్లో 1150 ఎకరాల్లో ఈ విధానంలో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల, ఇల్లెందు మండలాల్లో ఎంపిక చేసిన రైతులు సాగుకు సిద్ధమయ్యారు.
అధిక విత్తనాల కోసం రూ.4వేల ప్రోత్సాహకం
సాధారణ పద్ధతిలో అచ్చుపత్తయితే ఎకరానికి 4,200, సాలు పత్తయితే 7వేల మొక్కలు పడతాయి. కానీ అధిక సాంద్రత విధానంలో ఎకరానికి 25వేల మొక్కలు నాటాలి. సాధారణ పద్ధతిలో మొక్కల మధ్య 60-90 సెం.మీ, సాళ్ల మధ్య 100-120 సెం.మీ, దీనిలో మొక్కల మధ్య 20 సెం.మీ, సాళ్ల మధ్య 80 సెం.మీ దూరం పాటిస్తారు. సాధారణ పత్తిలో ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు సరిపోతే దీనిలో మాత్రం ఐదు ప్యాకెట్ల విత్తనాలు కావాలి. దీని కోసం ప్రత్యేకంగా బీటీ విత్తనాన్ని రూపొందించారు. ఈ విత్తన ప్యాకెట్ ఒక్కటి రూ.810 చొప్పున లభిస్తుంది. విత్తనాలు, కూలీలు, రసాయనాలు ఇలా అన్ని పెట్టుబడులు పెరుగుతాయి. రైతులకు ఎకరానికి రూ.2,430 అధికంగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చు కోసం రూ.4వేల ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందుకోసం తొలిదశలో ఎంపిక చేసిన రైతులకు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు.
మొక్కల పెరుగుదల నియంత్రణ కీలకం
సాధారణ పద్ధతిలో మొక్కలు, కొమ్మలు ఎంత ఎత్తుపెరిగి విస్తరిస్తే అంత ఉపయోగం. కానీ తెలికపాటి నేలల్లో సాగు చేసే అధిక సాంద్రత పత్తిలో మొక్కల పెరుగుదల నియంత్రణ కీలకం. మొక్కల పెరుగుదలను నియ ంత్రించేందుకు గ్రోత్ రెగ్యులేటర్ మెపిక్వాట్ క్లోరైడ్ రసాయనాన్ని పిచికా రీ చేయాలి. దీన్ని పంట 45 రోజులు, 60 రోజులకోసారి పిచాకారీ చేయాల్సి ఉంటుంది. మొదటిసారి పూత దశలో లీటర్ నీటిలో 1.5 మిల్లీ లీటర్లు, రెండోసారి కాయ దశలో 2 మి.లీ చొప్పున స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎత్తు, విస్తరణ ఉండదు. దీనివల్ల మొక్కలకు గాలి, సూర్యరశ్మి మంచిగా అందుతాయి. దీనివల్ల గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడలు వ్యాపించకుండా ఉంటాయి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు దగ్గరుండి సాగు
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు దగ్గరుండి మరీ అధిక సాంద్రత పత్తిసాగు చేయిస్తున్నారు. ఎంపిక చేసిన రైతులకు సాగులో శిక్షణ కూడా ఇచ్చారు. కూలీల ఇబ్బందులను అధిగమించేందుకు రూ.6 లక్షల విలువైన పత్తి నాటే యంత్రాన్ని కూడా అందుబా టులోకి తీసుకొచ్చారు. దీన్ని ముదిగొండ మం డలం యడవల్లిలో శనివారం ఆవిష్కరించారు. దీని సహా యంతో రాశి 665 విత్తనాలను నాటారు. ఈ యంత్రం వల్ల ఓ క్రమపద్ధతిలో విత్తనాలు నాటవచ్చని, కూలీల కొరతను అధిగమించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.