Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదల ప్రాణాలకు రక్షణగా తానా : ఎమ్మెల్యే
- తానా వైద్య శిబిరానికి విశేష స్పందన
నవతెలంగాణ -కారేపల్లి
పేదల ప్రాణాలకు రక్షణగా తానా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఆదివారం కారేపల్లి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. ఈశిబిరానికి కారేపల్లి, కామేపల్లి మండలాల నుండి వందలాది మంది తరలి వచ్చారు. ఈసందర్బంగా తానా జాయింట్ సెక్రెటరీ తాళ్లూరి మురళి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వారికి అన్ని విధాల ఆదుకుంటున్న తానా పల్లెలో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదల ప్రాణాలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవటం అభినంద నీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన రంగాలైన విద్యా, వైద్యం, వ్యవసాయంకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమంలో రాజీ పడటం లేదన్నారు. వైద్య రంగం ప్రాధాన్యతను గుర్తించి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. పల్లెలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను పల్లె దావాఖానాలుగా మార్చి నైపుణ్యం గల వైద్యులను నియమించి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. తానా చేస్తున్న సేవలకు తనవంతు సాయం అందిస్తానన్నారు.
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు
తానా వైద్యశిబిరాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 11 అంబులెన్స్‌లకు ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. 24 గంటల వైద్య సేవలు అందించే కారేపల్లికి తప్పని సరిగా అంబులైన్స్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. మండలంలో తానా సేవలను విస్తృత పర్చటానికి తన వంతు సాయం చేస్తానన్నారు. తానా జాయింట్ సెక్రెటరీ తాళ్లూరి మురళి మాట్లాడుతూ తాను పుట్టిన చదువుకున్న మండల ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మెగా క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో తానా ఆధ్వర్యంలో అమెరికా నుండి 400 మందికి పైగా తెలుగు వారిని స్వస్ధలాలకు పంపించటం జరిగిందన్నారు. అమెరికాలోని తెలుగు వారికి ఆర్ధిక, న్యాయం సాయం తానా అందిస్తున్న తానా 43 ఏండ్ల నుండి సేవలు అందిస్తుందన్నారు. అమెరికాలో 40 లక్షల మంది భారతదేశం వారు ఉన్నారని వారిలో 40 లక్షలు గుజరాతీ, 10 లక్షలు తెలుగువారు ఉన్నారన్నారు. కారేపల్లి మండలంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను తానా ప్రతినిధులు, 1993 పదోతరగతి విద్యార్ధులు స్వాగతం ఫలికారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు సునీల్ సావిల్, జరుగుడు శ్రీనివాసరావు. ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జడల వసంత, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, టీఆర్ఎస్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న రైతు బంధు మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వర రావు, సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్ మంగీ లాల్, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, మండల వైద్యాదికారి డాక్టర్ యాసా హన్మంతరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సామినేని రాఘవులు పాల్గొన్నారు.