Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తిసాగు వైపు రైతులు మొగ్గు
- వరిసాగు పట్ల అనాశక్తి కనబరుస్తున్న రైతాంగం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఎండతీవ్రతలకు నెర్రెలు బాసిన పుడమి తల్లి తొలకరి వానలతో పులకించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో గత వారం రోజులుగా మండల వ్యాన్తంగా ఓ మోస్తరు భారీ వర్షం కురిసిందనే చెప్పవచ్చు. పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరి చెరువులను సైతం తలపిస్తున్నాయి. దీంతో మండల రైతులు పంట భూములను దుక్కులకు అదునుగా భావించి సాగుకు సమాయాత్తం అవుతున్నారు. మండలంలో రైతులు ఎక్కువ మొత్తంలో పత్తి, వరి సాగుతో పాటు మిర్చి పంటలను సాగు చేస్తుంటారు. మండల వ్యాప్తంగా సుమారు 25 వేల ఎకరాలలో పత్తి , సుమారు 20 వేల ఎకరాలలో వరి సాగు, 5 వేల ఎకరాలలో మిర్చి పంటలను సాగు చేస్తుంటారు.
పత్తిసాగుకు మండల రైతులు మొగ్గు
ఈ ఖరీఫ్ సీజన్‌కు మండల రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది పత్తి క్వింటాళకు 10 వేల నుండి 12 వేల వరకు ధర పలకడంతో ఈ ఏడాది అదే స్థాయిలో లాభాలు వస్తాయనే ఆశతో మండల రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వ్యవశాయ శాఖ అధికారులు సైతం వరి సాగుకు బదులుగా ఎక్కువ మొత్తంలో రైతులను పత్తి ఇతర పంటలను సాగు చేపించేందుకు ఆ దిశగా రైతులను సమాయత్తం చేస్తున్నారు. వ్యవశాయశాఖ అధికారులు పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించడంతో పాటు పత్తి విత్తన ప్యాకెట్లను డీలర్లు ఆన్లైన్ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది.
వరి సాగు పట్ల రైతులు అనాశక్తి
గత కొంతకాలంగా వరి సాగులో లాభాలు రాక పోగా అప్పుల పాలవుతున్న వరి రైతులు ఈ ఏడాది వరి సాగు పట్ల అనాశక్తి కనబరుస్తున్నారు. ఎరువులు, పురుగుమందుల ధరలు అధికం కావడంతో పాటు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక పోవడంతో రైతులకు పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది.
దీంతో చాలా మంది వరి సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. కౌలు రైతులు సైతం ఈ ఏడాది వరి సాగుకు అంతగా మొగ్గు చూపడం లేదు. దీంతో కొంత మంది భూ యజమానులు తక్కుల కౌలుకు పంట పొలాలను కౌలు రైతులకు అప్పగిస్తున్న పరిస్తితితులు మండలంలో నెలకొన్నాయనే చెప్పవచ్చు. వ్యవశాయమే జీవనాధారంగా కుటుంబ భారం మోస్తున్న వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందనే చెప్పవచ్చు. వ్యవశాయాన్ని లాభసాటిగా మారుస్తానని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులను సమాయత్తం చేయడంతో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పించి అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.