Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే...
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
భవిష్యత్తు ఎర్రజెండాదేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలోని బిటిఆర్ భవన్లో ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని సిపిఎం పార్టీ సభ్యులకు రెండు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా మొదటిరోజు అంతర్జాతీయ-జాతీయ రాజకీయ విధానాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా క్లాసులను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్లాస్‌లకు ప్రిన్సిపాల్‌గా నండ్ర ప్రసాద్ వ్యహరించారు. అనంతరం సుదర్శన్ రావు మాట్లాడుతూ అంతర్జాతీయంగా పలు దేశాల్లో కమ్యూనిస్టులు తమ ప్రభావాన్ని చూపుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నూతనంగా కొలంబియాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడినట్లు తెలిపారు. కోవిడ్‌ను కట్టడి చేయడంలో కమ్యూనిస్ట్ దేశాలు అవలంబించిన విధానాలను వివరించారు. భారతదేశంలో ప్రస్తుతం కమ్యూనిస్టులకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఎర్రజెండాకు ఎదురులేదన్నారు. మత పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ విధానాలను సభ్యులకు వివరించారు. బిజెపికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని తెలిపారు. దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. భారతదేశం భిన్నత్వంలో-ఏకత్వం గల దేశమని మత రాజకీయాలను ఈ దేశ ప్రజలు సహించరని తెలిపారు.మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు భారీ కుట్ర పన్నుతుందన్నారు.ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలు బీజేపీ మనువాద రాజకీయాలను గమనిం చాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజలను చైతన్య వంతం చేయాలని సీపీఎం శ్రేణులకు సూచించారు. రెండో క్లాస్‌ను సిపిఎం సీనియర్ నాయకులు పి.సోమయ్య బోధించారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను వివరించారు. ఎంతోమంది అమరులు త్యాగాల ఫలితంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరు గౌరవం పొందుతున్నారని తెలిపారు. కమ్యూనిస్టులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బూర్జువా పార్టీలు, పత్రికలు విష ప్రచారం చేశాయని, భవిష్యత్‌లో కూడా దుష్ప్రచారం చేస్తారని వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి పార్టీ సభ్యుడు, కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ సభ్యులు నిరంతరం అధ్యయనం చేయాలని కోరారు. నిరాధార ఆరోపణలు చేసిన వారికి తగు రీతిలో సమాధానం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, తెల్దారు పల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సిపిఎం నాయకులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్‌రావు, నందిగామ కృష్ణ, యామిని ఉపేందర్, కొప్పుల రామయ్య, పొన్నం వెంకటరమణ, పల్లె శ్రీనివాసరావు, మద్ది వెంకటరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, యర్రా నర్సింహా రావు, రంజాన్, నారాయణ, కారుమంచి గురవయ్య, కర్లపూడి వెంకటేశ్వర్లు, కోటి శ్రీనివాస్, కిరణ్, ఐద్వా మండల కార్యదర్శి పెండ్యాల సుమతీ, తమ్మినేని కమలమ్మ, నాగమణి, సావిత్రి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.