Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి
- సబ్‌కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్
- 976 కేసులు పరిష్కారం
- రూ. 93.99 లక్షల ఆర్థిక లావాదేవీల
- కేసులను పరిష్కరించిన న్యాయమూర్తులు
నవతెలంగాణ- సత్తుపల్లి
కోర్టులో కేసు వేస్తే వచ్చే తీర్పులో ఇరుపక్షాల్లో ఒక్కరే గెలుస్తారని, అదే లోక్ అదాలత్ తీర్పు అయితే ఇరుపక్షాలు గెలుస్తారని సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర న్యాయసేవా సంస్థ వారి ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక సబ్‌కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అరుణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయసేవా సంస్థ నిర్వహించే లోక్ అదాలత్‌ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే తీర్పు అంతిమమని, పైకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఇప్పటి వరకు జరిగిన లోక్ అదాలత్‌ల ద్వారా 5200 పైగా కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి వాతావరణం కలుగుతుందన్నారు. డబ్బు ఖర్చుకాదన్నారు. సమయం ఆదా అవుతుందన్నారు. అదే కోర్టులో కేసువేస్తే చాలా కాలం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎందుకంటే అంతకు ముందు ఉన్న కేసులు పూర్తయితేనే కొత్తగా వేసిన కేసులకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అప్పటి వరకు కోర్టు పక్షిలా తిరగాల్సిన పరిస్థితి కక్షిదారులకు తప్పదన్నారు. లోక్ అదాలత్ కేసులకు ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదే కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి అరుణకుమారి ప్రసంగిస్తూ మాదవ ద్రవ్యాల వినియోగం- వాటి అనర్థాలను వివరించారు. బార్ అధ్యక్షులు ఎంవీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణజ్యోతి, అడిషనల్ సివిల్ జడ్జి అయేషాసరీన్, ఏసీపీ ఎన్.వెంకటేశ్, పట్టణ సీఐ తాటిపాముల కరుణాకర్, రూరల్ సీఐ హనూక్, ఆర్డీవో సూర్యనారాయణ, ఏపీపీవో ప్రదీప్, ఎస్సైలు, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో 8 రకాల కేసులకు సంబంధించి 976 కేసులు పరిష్కారం అయ్యాయి. ఆర్థిక లావాదేవీల కేసులకు సంబంధించి న్యాయమూర్తులు ఇరుపక్షాలను రాజీ కుదిర్చి రూ. 93,99,586 నగదుకు పరిష్కారం చూపారు.