Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
బంజరా గిరిజనుల సంప్రదాయ పండుగ సీత్లా(దాటోడి)ని మంగళవారం కారేపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పశు సంపద అభివృద్ధి, పంటలను చీడ పీడల నుండి కాపాడలంటూ వర్షకాలం ప్రారంభ సీజన్లో బంజార గిరిజనులు ఈ దాటోడి(సీత్లా) వేడుకను నిర్వహించటం అనవాయితీ. ఆషాఢమాసం ప్రారంభం కానున్న తరుణంలో ప్రకృతి ఆరాధిస్తూ మంగళవారం రోజున బంజారతండాలు దాటోడీ వేడుకలతో సందడిగా మారతాయి. ఈ వేడుక ముఖ్య ఉద్దేశం వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పశు సంపదకు ఎలాంటి జబ్బులు రాకుండా వృద్ది కావాలని, పంటలు పుష్కలంగా పండాలని దేవతలను కోరటం. వర్షాకాల సీజన్ ప్రారంభంలో పశువులకు వివిధ రకాల జబ్బులకు గురవుతాయి. వాటి నుండి కాపాడమని గ్రామ పొలిమెర్లలో భవానీలు మేరామ, తోళ్జా, మాత్రాల్, కంకాళి, హీంగ్లా, ద్వాళాంగర్, సీత్లా ను నెలకొల్పి అక్కడ వేడుకను జరుపుతారు. ఊరి పొలిమెర్లలో ఏడు రాళ్లు(భవాని విగ్రహాలు) వాటికి ఎదురుగా మరో రాయి(పోతురాజు)ను తండాకు చెందిన పెద్ద ప్రతిష్టిస్తారు. గ్రామంలోని బంజార మహిళలు(ఇంటి ఆడపడుచులు) 7 రకాల వంటలను తయారు చేసి వాటిని బోనాలుగా నెత్తిపై పెట్టుకోని ఊరి పొలిమెరలో వేడుక వద్దకు చేరుకుంటారు. అక్కడ మహిళలు గిరిజన సంప్రదాయ ఆట, పాటలతో ఉత్సహంగా గడుపుతారు. దేవతల విగ్రహాల వద్ద కోళ్లు, మేకలు, గొర్రెలను బలిచ్చి వాటి రక్తంను మహిళలు తీసుకవచ్చిన బోనాల్లో కలుపుతారు.
పొలి చల్లుతూ పాటలు పాడుతూ...
దేవతలకతు బలిచ్చిన జంతువుల ప్రేగులను భవాని విగ్రహం నుండి దాని ఎదురుగా ఉన్న పోతురాజు విగ్రహం వరకు పేర్చి దాని పై నుండి ఆవులు, ఎడ్లు, ఇతర పశు సంపదను దాటిస్తారు, దీనినే దాటోడి అంటారు. ఈ సందర్బంగా రక్తం కల్పిన బోనాన్ని(పొలిని) పశువులపై చల్లుతూ దేవతలను కీర్తిస్తూ పాటలు పాడతారు. మంగళవారం బొక్కలతండాలో సర్పంచ్ బానోత్ సంద్యారాందాస్ ఆధ్వర్యంలో దాటోడీని నిర్వహించారు. భీక్యాతండా, తులిశ్యాతండా, కారేపల్లిలలో దాటోడి వేడుకను తండా వాసులు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమాల్లో సర్పంచ్లు బానోత్ సంధ్యారాందాస్, అజ్మీర అరుణ, బంజార పెద్దలు అజ్మీర బిచ్చానాయక్, వాంకుడోత్ రాములు, హట్కర్ లకుమా, బానోత్ బావుసింగ్, మాలోత్ పడిత్యా, వాంకుడోత్ అనంతరాములు, హతీరాం, భూక్యా సుజాత, వాంకుడోత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.