Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఇంటి ఎదుట గిరిజనుల ఆందోళన
- పంపిణీ విషయం నాకే తెలియదు - సర్పంచ్ భూక్యా రమణ
నవతెలంగాణ-కారేపల్లి
దళారులకు ముడుపులు ముట్టచెప్పిన వారికి పోడు హక్కులు పత్రాలు వచ్చాయని, పైకం ఇచ్చుకోలేని మాకు పోడు పట్టాలు రాలేదంటూ హక్కుపత్రాలు రాని గిరిజనులు ఉమ్మడి పంచాయతీ ఆర్వోఎఫ్ఆర్ కమిటీ చైర్మన్ గా పని చేసిన ప్రస్తుత రేలకాయలపల్లి సర్పంచ్ భూక్యా రమణ ఇంటి ముందు అందోళనకు దిగిన ఘటన కారేపల్లి మండలం రేలకాయలపల్లి పంచాయతీ తవిసిబోడు లో చోటుచేసుకుంది. రేలకాయలపల్లి, గేటురేలకాయలపల్లి, జైత్రాంతండా, టేకులగూడెం, తొడితలగూడెం పంచాయతీలకు చెందిన 428 మందికి అధికారులు హడావిడిగా ప్రజాప్రతినిధులకు కూడా తెలియకుండా హక్కు పత్రాలను రాత్రి సమయంలో పంపిణి చేశారు. దీనిపై విమర్శలు వినవస్తుండగా పోడుకు హక్కులు రాని 78 గిరిజన కుటుంబాలు అందోళన బాట పట్టారు. ముడుపులు ముట్టచెప్పిన వారికి ఇండ్లకు వచ్చి కనీసం స్ధానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా హక్కుపత్రాలు పంపిణి చేశారని, తమ పరిస్ధితి ఏమిటని సర్పంచ్‌ను ప్రశ్నించారు. ఉమ్మడి పంచాయతీ ఆర్వోఎఫ్ఆర్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన ప్రస్తుత సర్పంచ్ భూక్యా రమణ ఆధ్వర్యంలో 2008లో పైల్ పెట్టిన తమ కు హక్కులు రాకుండా, 2017లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఎలా వచ్చాయంటూ గిరిజనులు ప్రశ్నించారు. ముడుపులు ముట్టచెప్పిన వారికి హక్కుపత్రాలు ఇచ్చినా అధికారులు అర్హులైన తమను పట్టించుకోలేదని అగ్రహం వ్యక్తం చేశారు. తమ పైల్స్ సబ్ డివిజన్ లెవల్ (ఎస్డీఎల్సీ), జిల్లా స్ధాయి (డీఎల్సీ) కు పంపకుండా అధికారులు తొక్కి పెట్టారని ఆరోపించారు. తమ కోసం సర్పంచ్‌గా పోరాడాలని లేదా రాజీనామా చేయాలంటు డిమాండ్ చేశారు.
పంపిణీ విషయం నాకే తెలియదు -సర్పంచ్ భూక్యా రమణ
గిరిజనులకు హక్కుపత్రాలను హడావిగా రాత్రి సమయంలో పంపిణీ చేశారు. పంపిణీ విషయం నాకే తెలియదు. అర్హులైన చాలా మందికి హక్కు పత్రాలు రాలేదు. దీనిపై ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ దృష్టికి కూడా తీసుకెళ్ళినా. 2008లో దరఖాస్తులు చేసుకున్న వారికి రాకపోగా 2017లో దరకాస్తులు చేసుకున్న వారి రావటంతో అర్హులైన వారి ఆవేదనలో న్యాయం ఉంది. అధికారులు స్పందించి అర్హులందరికి హక్కుపత్రాలు ఇవ్వాలి. దీనిపై కలెక్టర్‌ను కలుస్తాం దానిపై స్పందన రాక పోతే భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాము.