Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజులుగా జామాయిల్ తోటలో కట్టివేసి ఉంచిన వైనం
- మేత నీళ్లు లేక డొక్క ఈడ్చుతున్న నోరులోని పశువు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గొడ్డు ఏడ్చిన, బిడ్డ ఏడ్చిన ఆ పాపం తగులుద్ది అనేది నానుడి సామెత. కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడుగా దుక్కిటెద్దును అమ్మేందుకు పదకం వేశారు. పక్క ఊరు నుండి వచ్చిన ఎద్దును గ్రామ సరిహద్దులో తాళ్లతో కట్టేశారు. దానికి కనీసం నీళ్లు మేత లేకుండా వారం రోజుల నుండి పస్తులుంచుతున్నారు. దీంతో ఎద్దు డొక్క ఈడ్చుకుంటూ అంబా అంటూ ఆర్తనాదాలలు పెడుతోంది. పాపం నోరులేని పశువు గోడు వారికి తగలక తప్పదనే చెప్పవచ్చు. ఎండాకాలం వచ్చిందంటే చాలు పశువులు ఒక ఊరు నుండి ఒక ఊరికి మేతకు వెళుతుంటాయి. ఒక్కో సారి నీడ, నీళ్లు అనుకూలంగా ఉన్న చోట ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి పోతాయి. ఆ సమయంలో పక్క ఊరు నుండి వచ్చిన పశువు అని, దీని ఆచూకి కోసం ఎవ్వరూ రావడం లేదని గుర్తించి ఆ పశువును ఎవరో ఒకరు కట్టేసుకుని మేత నీళ్లు పోసి చూసుకుంటారు. ఎద్దు యజమాని ఆచూకీ కోసం వచ్చిన సమయంలో ఎద్దు తమదేనని తెలిపి తన వెంట తీసుకు వెళతారు. కానీ చిన్నబండిరేవు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్.కొత్తగూడెం గ్రామంలోకి వచ్చిన ఓ దుక్కిటెద్దున గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ సమీపంలో జామాయిల్ తోటలో గత వారం రోజులుగా కట్టి వేసి ఉంచిన సమాచారాన్ని నవతెలంగాణ సేకరించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పశువును వారం రోజులగా తాడుతో కట్టి వేసి ఉంచారని, ఎద్దుకు కనీసం మేత నీళ్లు కూడా పోయడం లేదు. దీంతో పాటు ఎద్దును కోనుగోలు చేసే ఓ వ్యక్తితో బేరసారాలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. వీలు కుదిరితే గుట్టు చప్పుడు కాకుండా ఎద్దున తరలించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నట్లు సమాచారం. ఏది ఎమైనా నోరు లేని పశువును వారం రోజులుగా మేత, నీళ్లు లేకుండా ఉంచిన అట్టి వ్యక్తుల సమాచారాన్ని జంతు శాఖ సంరక్షణ అధికారులు సేకరించి వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎద్దును సైతం ఎవరిదో తెలుసుకుని వారికి అప్పగించే భాద్యత అధికారుల పై ఉందనే చెప్పవచ్చు.