Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపైన ఉంది
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
చిన్నారును బాల కార్మికులిగా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పిల్లలను పనుల్లో పెట్టుకుంటే పోలీస్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ కమిటీ ఆద్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ 8 కార్యక్రమంపై పోలీస్, కార్మిక, వైద్య, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన బాలలను తక్షణమే బాలల హక్కుల రక్షణ కమిటీ ముందు హాజరు పరచి వారి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో 41 ప్రాంతాల్లో బాల కార్మికులుంటే హాట్స్ స్పాట్స్ గుర్తించామని ఆ ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించి బాలలను పనుల్లో పెట్టుకునే వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మన జిల్లా లైల్డ్ ఫ్రెండ్లీ జిల్లా కావాలని అందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. బాలలకు మనవంతు సపోర్టు అందిస్తే వారి ఎదుగుదలకు, వారి బంగారు భవిష్యత్తుకు పాటుపడిన వారమవుతామని సూచించారు. సహాయం లభించక నిరాధారమైన పరిస్థితుల్లో పనుల్లో చేరుతున్నారని, అటువంటి వారందరినీ గుర్తించి వారి జీవితాలను మార్చేందుకు బడులకు పంపాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో బాల కార్మికులుగా పనిచేస్తుంటారని వారందరినీ గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్లు, వయోవృద్ధుల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంలో కేంద్రాల్లో సౌకర్యాలు కల్పన, చిన్నారుల, వయోవృద్ధుల సంరక్షణ, సీసీ టివిలు పనితీరును పరిశీలించాలని చెప్పారు. అపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన చిన్నారుల పరిరక్షణ చర్యలను నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరుగుతున్న మండలాల్లో తహసిల్దార్ అధ్యక్షతన కుల పెద్దల సమక్షంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. బాల్య వివాహాలు నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని అందులో భాగంగా తల్లితండ్రులపైనా, వరుడుపైనా పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలతో పాటు ఏదేని సంఘటనలు జరిగితే అన్ని శాఖల అధికారులు భాగస్వాములై బాలల పక్షాన నిలబడి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని చెప్పారు. సఖి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంక్షేమ శాఖ అధికారులను అదేశించారు. అనంతరం బాలల సంరక్షణ పోస్టర్లును అవిష్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, బాలల హక్కుల పరిరక్షణ అధికారి హరికుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.దయానందస్వామి, కార్మిక అధికారి రవి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాధిక్, సుమిత్రాదేవి, భారతీరాణి, ఎన్సీఎల్పీ పిడి సంగీత, 109 కో- ఆర్డినేటర్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.