Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజక వర్గ ప్రజానీకానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 8వ తేదీన భద్రాచలంలో జరిగే పాలక మండలి సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజక వర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజక వర్గంలో ప్రధానంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. భద్రాచలం అభివృద్ధికి రూ.వంద కోట్లు, పోడు భూములకు పట్టాలు, ఉపాథి హామీ పెండింగ్ బిల్లులు గత రెండేండ్లుగా చేసిన పనికి వేతనాలు ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు, దుమ్ముగూడెం ప్రగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, చర్ల ఒద్దిపేట చెక్ డ్యామ్‌కు నిధులు, భద్రాచలం కరకట్ట ఎత్తు పెంచటం, స్లూస్, దళిత బంద్ వంటి కీలక సమస్యలపై తెలంగాణా ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాల రక్షణ, భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను విలీనం తదితర సమస్యలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కకు పెట్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడుతన్నాయని ఆరోపించారు. భద్రాచలం గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. నియోజిక వర్గ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తరలి పోతున్నా నియోజక వర్గ అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మొత్తం సమస్యలపై సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ పాలక మండలి సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు బాల నరసారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, యన్ లీలావతి, డి.లక్ష్మి, కుసుమ, జ్యోతి, నాగరాజు, కుంజా శ్రీను, లక్ష్మణ్, కొరాడి శ్రీను, రత్నం, చేగొండి శ్రీను, బూపెందర్ తదితరులు పాల్గొన్నారు.