Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ-భద్రాచలం
రానున్న మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఆదివారం భద్రాచలం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందుగా పట్టణంలోని కొత్తకాలనీ వద్ద ఉన్న స్లూయిస్లను ఆయన పరిశీలించి వరద నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు వరద నీటిని గోదావరిలోకి వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆయన సూచించారు. అదే విధంగా ముంపు ప్రాంతాలలో ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణులు గుర్తించి తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని చప్ట దిగువ నున్న స్లూయిస్ లను ఆయన పరిశీలించి నిల్వ ఉన్న చెత్తను త్వరగా తొలగించాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద వరద ఉధృతిని పరిశీలించి, వరద నీటి పరిసరాల దగ్గరకు ప్రజలు వెళ్ళకుండా నియంత్రణ చేసేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాంటి హెచ్చరికలను ఖాతరు చేయని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్నాన ఘట్టాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఆనంతరం విలేకర్లతో కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుంచి గోదావరికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాలలో లోతట్టులో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రికి వరద ఉధృతి మరింత పెరిగి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోదావరి పరివాహ లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు యువకులు చేపల వేటకు సరదాగా ఫోటోలు దిగేందుకు వరద ప్రవాహాల వద్దకు వెళ్ళవద్దని అన్నారు. వరద సహాయక చర్యలు పోలీస్ శాఖ తనవంతు కృషిగా చర్యలు చేపడుతుందని ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ డా.వినీత్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ అధికారి రాంప్రసాద్, గ్రామ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.