Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాట్యూటీ చట్టం అమలు కోసం జూలై 11న ధర్నా : సీఐటీయూ
నవతెలంగాణ-చర్ల
ఐసీడీఎస్ పరిరక్షణ కోసం సమస్యల పోరాటాలకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మినీ వర్కర్లు సిద్ధం కావాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.పద్మ, జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చర్ల ప్రాజెక్టు మహాసభ శివలింగాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసి, అంగన్వాడీ టీచర్లకు చట్టబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు ఐఎల్ఓ సిఫార్సుల ప్రకారం కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా మార్పు చేయాలని మినీ కేంద్రాలకు హెల్పర్లను నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్ట్‌లను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ఖరీదు రూ.1200 ఉండగా ప్రభుత్వం రూ.900 రూపాయలు మాత్రమే ఇస్తుందని రవాణాతో కలిపి ఒక్కో టీచరు అదనంగా రూ.400 భరించవలసి వస్తుందని, ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం భరించాలని రవాణా కలిపి గ్యాస్ సిలిండర్‌కి అయ్యే మొత్తం రూ.1300 ప్రభుత్వం అంగన్వాడీలకు చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం వల్ల ఐసీడీఎస్ వ్యవస్థ బలహీన పడిపోతుందని, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు ఐసీడీఎస్‌ను కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం జూలై 11వ తేదీన దేశవ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభకు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీనియర్ నాయకురాలు కమల మనోహర్ అధ్యక్షత వహించగా సీఐటీయూ మండల కన్వీనర్ పాయం రాధాకుమారి, మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం.విజయశీల, ప్రాజెక్టు నాయకులు స్వరూప, పి.నాగమణి, చిలకమ్మా ,రాణి, సత్యవతి, అనసూర్య, నాగమణి, జ్యోతి, కృష్ణవేణి, శోభారాణి, బి.నాగమణి, తదితరులు పాల్గొన్నారు.