Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీని వీడని వానలు
- నిండుతున్న వాగులు, వంకలు
- తాలిపేరులోకి భారీగా వరద నీరు
- భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
- భద్రాద్రి కరకట్ట భద్రమా...?!
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మన్యంలో గోదావరి ఉరకలు పెడుతోంది. జోరు వానలు ఏజెన్సీని ముంచెత్తుతుండటంతో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీకి ఎగువు ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 9గంటలకు గోదావరి 40 అడుగులకు చేరుకొని ఉధృతంగా ప్రవహిస్తోంది. 43 అడుగులు చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికార యంత్రాంగం భావించి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మన్యంలో గోదావరి ఉరకలు
గత నాలుగు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ తడిసి ముద్దయింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వరద ఉధృతి పెరుగుతోంది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం ప్రాజెక్ట్‌లో ఉన్న 25 గేట్లకు గాను 16 గేట్లు ఎత్తి 20,300 క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం నుంచి గోదావరి స్పీడ్‌గా పెరుగుతూ వచ్చింది. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలకు రక్షణ హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డా.వినీత్ ఆదివారం సాయంత్రం భద్రాచలం చేరుకొని గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. గోదావరి పరివాహక ప్రాంతాన్ని వారు పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడారు. వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. జోనల్, సెక్టోరల్ అధికారులు స్థానికంగా ఉండాలని తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్, కొత్తగూడెం కలెక్టరేట్లో గోదావరి వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
భద్రాద్రి కరకట్ట భద్రమా...?! :
వర్షాకాలం వచ్చిందంటే భద్రాచలం ఏజెన్సీకి వరద ముప్పే. ప్రతియేటా వరదలు విలయ తాండవం చేస్తూ ఉండడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో భద్రాచలం పట్టణంతోపాటు, నియోజకవర్గంలోని అనేక గ్రామాలు నీటమునిగాయి. 1986వ సంవత్సరంలో భద్రాచలం వద్ద 75.6 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక గోదావరి కావడం గమనార్హం. 1990లో 70.8 అడుగులు, 2006లో 66.9 అడుగులు, 2020 లో 61.6 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదయింది. 1986 గోదావరి వరదల సందర్భంగా భద్రాచలం పట్టణం సగభాగం నీటితో జలమయమైంది. అయితే భద్రాచలం రామ క్షేత్రాన్ని వరద తాకిడి నుంచి తప్పించేందుకు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో భద్రాచలంలో కరకట్ట నిర్మాణాన్ని గావించారు. అనంతరం కాస్త భద్రాచలం పట్టణాన్ని కరకట్ట గోదావరి ముంపు నుంచి కాపాడింది. అయితే కరకట్ట పొడిగింపు ప్రతిపాదనలు గత ప్రభుత్వాలకు చేరినప్పటికీ నేటికీ కరకట్ట పొడిగింపుకు నోచుకోలేదు. ఉన్న కరకట్ట కూడా గోతుల మయమైంది. అక్కడక్కడ రంధ్రాలు కూడా ఏర్పడి కరకట్ట ప్రమాదభరితంగా మారింది. కరకట్టకు ఆనుకొని భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్, విస్తా కాంప్లెక్స్, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, ఏ.ఎం.సీ కాలనీలో స్లులూయిస్లు ఏర్పాటు చేయగా...వాటి మెయింటెనెన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో అడపాదడపా స్లూయిస్‌లు లీకై పరిసర ప్రాంతం ప్రతి ఏటా జలమయంగా మారుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. వరదల సందర్భంలో ఈ స్లులూయిస్లను మూసి వేస్తుండడంతో పట్టణంలోని మురుగు నీరు అంతా అక్కడికి చేరుకొని గోదావరికి వెళ్లే మార్గం లేక ఆ నీళ్లు వెనక్కి వచ్చి కూడా పరిసర ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నీటిని మళ్లించేందుకు మోటార్లు ఏర్పాటు చేస్తున్న ప్పటికీ...ప్రతి ఏటా భద్రాచలం రామాలయం పరిసరాల్లో ఉన్న నిత్య అన్నదాన సత్రం ప్రాంత నీటితో నిండి పోతోంది. కరకట్టను బాగు చేయాలని, ఉన్న కరకట్టను మరింత పొడిగించాలని, స్లులూయిస్లను పటిష్ట పరచాలని, పట్టణ వాసుల ఇబ్బందులను తొలగించాలని శుక్రవారం ఐటీడీఏ పాలకమండలి సమావేశం సందర్భంగా సీపీఐ(ఎం) శ్రేణులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన విషయం విదితమే. ఇకనైనా అధికారులు పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య స్లులూయిస్ లీకులపై దృష్టిసారించి పట్టణానికి పొంచి ఉన్న వరద ముప్పు నుంచి స్థానికులను కాపాడాల్సి ఉంది.