Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవ తెలంగాణ-బోనకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సంఘం మండల మహాసభ ఆ సంఘం అధ్యక్షుడు ఉమ్మనేని రవి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత మహాసభ ప్రారంభ సూచికంగా సంఘం పతాకాన్ని ఉమ్మనేని రవి ఆవిష్కరిం చారు. అనంతరం జరిగిన మహాసభలో పొన్నం మాట్లాడుతూ ప్రస్తుత వ్యవస్థ కూలీలను మోసం చేసేదిగా ఉందన్నారు. ఒకప్పుడు ధాన్యాన్ని కూలిగా ఇచ్చారని కానీ ప్రస్తుతం డబ్బులను కూలిగా ఇస్తున్నారన్నారు. గత ఏడాది 200 రూపాయలు కూలి ఇస్తే ఈ ఏడాది కూడా 200 రూపాయలు కూలి ఇస్తే పెరిగినట్లు, తగ్గినట్లా, యధావిధిగా ఉన్నట్లా అని మహాసభకు హాజరైన కూలీలను ఆయన ప్రశ్నించగా యధావిధిగా ఉన్నట్లని సమాధానం చెప్పారు. దీంతో ఆయన ఇందులో గల మోసాలను వివరించారు. ఉపాధి హామీ పనులు చేసే వారికి రోజు కూలి ఉపాధి హామీ చట్టం ప్రకారం 257 రూపాయలు ఇవ్వాలన్నారు. కానీ ఇది ఎక్కడ అమలు జరగడం లేదన్నారు. కేరళ రాష్ట్రంలో కూలీలకు ప్రతిరోజు 650 రూపాయలు ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చిందని, అదేవిధంగా 18 రకాల నిత్యవసర సరుకులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని ఆ విధంగా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది అన్నారు. ఆ ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుందన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గతంలో రేషన్ షాపుల ద్వారా ఇచ్చిన సరుకులు అన్నింటిని ఎత్తివేసాడని విమర్శించారు. తొలుత మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు నివేదికను ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, తూటికుంట్ల సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ, ముష్టికుంట్ల మాజీ సర్పంచ్ బంధం వెంకటరాజ్యం, ఆ సంఘం నాయకులు దూబ భద్రాచలం, కొండ నాగేశ్వరరావు, మిర్యాల వెంకటకృష్ణ, సిఐటియు నాయకులు బూర్గుల అప్పచారి తదితరులు పాల్గొన్నారు.
మండల కమిటీ ఎన్నిక
వ్యకాస మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా ముష్టికుంట గ్రామానికి చెందిన బంధం శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడిగా గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన ఉమ్మనేని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రామాపురం మాజీ సర్పంచ్ కొండ నాగేశ్వరరావు పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన పెద్దపోలు కోటేశ్వరరావు సహాయ కార్యదర్శిలుగా తూటికుంట్ల గ్రామానికి చెందిన నోముల పుల్లయ్య ముష్టికుంట్ల గ్రామానికి చెందిన దుగ్గి వెంకటేశ్వర్లతో పాటు మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.