Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫికేషన్ లేని వ్యక్తులతో విద్యా బోధన
- పుస్తకాలు, యూనిఫామ్లతో వ్యాపారం
- మరుగుదొడ్లు లేక ఇక్కట్లు...
- ఫిట్నెస్ లేని వాహనాలు.. అర్హతలేని డ్రైవర్లు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ...
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ప్రయివేటు పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవస్థ వ్యాపార సంస్థగా మారింది. ఇదే అదునుగా భావించి ప్రయివేటు పాఠశాలల యాజ మాన్యం అధిక ఫీజుల దోపిడీకి తెరలేపారు. మరోవైపు పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాంలు కచ్చితంగా కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ములు పోగుచేసుకుంటున్నారు.
మండలంలో 5 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 2వేల మంది చదువుతున్నారు. వీరికి బీఈడీ, టీటీసీ విద్య అర్హతలేని వ్యక్తులతో బోధన చేయిస్తున్నారు. వీరికి నెలకు రూ.5వేలు ఇచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. ఎల్కేజీ విద్యార్థికి సైతం 20 వేల రూపాయల నుండి 30 వేల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక మిగతా తరగతులకు చెప్పనవరమే లేదు. అలాగే పాఠశాలలోనే నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, యూనిఫామ్, బెల్టు, బూట్లు, పుస్తకాలు, స్టేషనరీ తదితర ఉపకరణాలు వారి వద్దనే కొనాలని షరతులు విధిస్తూ చిల్లర దుకాణాలలో సరుకులు లాగా విక్రయిస్తున్నారు. బయట కంటే అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము పోగేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవు. విద్యార్థులు ఆడుకోవటానికి సరైన ఆటస్థలాలు లేవు. మరుగు దొడ్లు కూడా లేకపోవడంతో వాహనాలు తిరిగే రోడ్లపైనే విద్యార్థులు మూత్ర మల విసర్జన చేస్తుండటంతో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోయినా అడిగే నాథుడే కరువయ్యారు. రేకుల షెడ్డులోనే పాఠశాలలు నిర్వహిస్తున్న పరిస్థితి. వర్షం వస్తే విద్యార్థుల పరిస్థితి చెప్పనవసరం లేదు. వాహనాలకు పార్కింగ్ స్థలం లేదు. రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్, వాహనాలకు సరైన ఫిట్ నెస్ లేదు. తక్కువ జీతానికి అర్హత లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు. ఇంచార్జి మండల విద్యా శాఖ అధికారి తప్ప రెగ్యులర్ విద్యాశాఖ అధికారి లేక ఆరు సంవత్సరాలు పైబడినది. ఇన్చార్జి విద్యాశాఖ అధికారి కావడంతో పర్యవేక్షణ కొట్టొచ్చినట్టు లోపం కనిపిస్తుంది. అధిక ఫీజులు తీసుకుంటున్నారని అధికారులకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. యాజమాన్యంతో మాట్లాడిన అధికారులు ఎవరూ ఏమీ చేయలేరని చెబుతున్నారని అన్నారు. మధిర ఎర్రుపాలెం రెండు మండలాలలోని ప్రైవేట్ పాఠశాలలు యూనియన్‌గా అవతారమెత్తి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులను నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా :వి.ప్రభాకర్, ఇన్చార్జి మండల విద్యాశాఖాధికారి
మండలంలోని ఐదు ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. స్టేషనరీ, ఫైర్ సేఫ్టీ, ఆటస్థలం, పార్కింగ్ స్థలం, అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన, బస్సుల ఫిట్ నెస్, మరుగుదొడ్లు తదితర సమస్యలపై ఇప్పటి వరకు తనకు ఫిర్యాదులు అందలేదు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తాను. నిబంధనలు పాటించకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.