Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు
- పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-చింతకాని
రెవెన్యూ శాఖలో చిరు ఉద్యోగులైన రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. పనికి తగిన వేతనం లేక పని భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో వీరిచే కులం, ఆదాయం, పంచనామా నోటీసుల జారీ ప్రక్రియలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటున్న వీరు తమ సమస్యలు పరిష్కరించాలని పొరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 5న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. తదుపరి కలెక్టరేట్ల వద్ద రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టాలని వీఆర్ఏల సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి వీఆర్ఏలు సమ్మె చేపట్టనున్నట్లు సంఘం నిర్ణయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో 1993 నవంబర్ 25 నుంచి ప్రభుత్వం బ్యాన్ పీరియడ్ విధించింది. అయినప్పటికీ తహసీల్దార్లో పని భారాన్ని చూపుతూ వీఆర్ఏలను నియమించుకున్నారు. 2011లో తహసీల్దార్ నియమించుకున్న వీఆర్ఏలను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు చెల్లించాలని జీవో నెంబర్ 2176 విడుదలైంది. 2012లో ఏపీపీఎస్సీ వీఆర్ఏల ఎంపిక సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 648 మంది విఆర్ఏలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెంలో 510 మంది కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1148 మంది విధులు నిర్వహిస్తున్నారు.
అందని పేస్కేల్..
రెవెన్యూ శాఖలోని వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని పేస్కేల్ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఫిబ్రవరి 24వ తేదీన ప్రగతిభవన్లో వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. పేస్కేల్ ఇవ్వకుండా రూ.6500 వేతనాన్ని రూ.10,500కు పెంచారు. తర్వాత రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020 సెప్టెంబర్లో నూతన రెవెన్యూ చట్టం చేసే క్రమంలో వీఆర్వో వ్యవస్థ రద్దు పై అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా మినిమం పేస్కేల్ వర్తింప చేస్తామని ప్రకటించారు. 22 నెలల గడిచిన కేసీఆర్ హామీ నెరవేరకపోవడంతో వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు.
డిమాండ్లు ఇవి...
- వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి
- అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి
- 55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలి.
- మరణించిన వీఆర్ఏల స్థానంలో ఎలాంటి షరతులు లేకుండా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.
పని ఒత్తిడి ఎక్కువైంది : బొమ్మకంటి నాగేశ్వరరావు (వీఆర్ఏ బస్వాపురం చింతకాని మండలం.)
వీఆర్ఏలకు ఇస్తున్న వేతనం దినసరి కూలీ కంటే తక్కువ. పేస్కేల్ లేకుండా ఎన్నాళ్లు పని ఒత్తిడితో ఉద్యోగం చేయాలి. వీఆర్వో వ్యవస్థ రద్దుతో వీఆర్ఏలపై మరింత పని భారం పెరిగింది. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పే స్కేల్ అమలు చేయాలి.
25 నుంచి సమ్మెకు దిగుతాం : షేక్ అజీజ్ (వీఆర్ఏల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు )
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కలెక్టరేట్ ఎదుట చేపట్టాం వెట్టి చాకిరీ చేయిస్తూ ప్రభుత్వం వీఆర్ఏల పట్ల చిన్నచూపు చూస్తుంది నెల 22 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి 23న కలెక్టరేట్ ముట్టడితోపాటు 25 నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతాం.