Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్య్లూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సూరిబాబు, జి. వెంకటేశ్వర్లు
- జిల్లా విద్యాశాఖాధికారికి వినతి పత్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రైవేట్ విద్యా సంస్థల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మకు వినతి పత్రం అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలన చేసి మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని డిఇఓ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆయా యాజమాన్యాలలో పనిచేసిన జర్నలిస్టులు కరోనా భారిన పడి చనిపోవడంతో పాటు యాజమాన్యాల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలా సర్కులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెదక్, జోగులాంబ గద్వాల లాంటి కొన్ని జిల్లాలలో ఉచిత విద్యకు సంబంధించి సర్క్యులర్ విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలిశెట్టి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. కోటేశ్వరచారి, డి.రవి కుమార్, యూనియన్ సభ్యులు పెనుగొండ సదానందం, చంద్రగిరి, ప్రసాద్, నాయుడు, వినోద్, బర్ల రాము, సతీష్, ఏ.రత్నకుమార్, శ్రీనివాస్, హరికృష్ణ, సుదర్శన్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.