Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార వస్తువులపై జిఎస్టీ రద్దు చేయాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
నవతెలంగాణ- ఖమ్మం
పేదలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారని, మరోవైపు ఆహార వస్తువులపై కూడా జిఎస్టీ విధిస్తున్నారని శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీ రోడ్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు తినే ఆహార వస్తువులపైన జిఎస్టీ 5 శాతం విధించటం అన్యాయమని అన్నారు. పాలు, పెరుగు, తేనె, చేపలు, మాంసం మొదలగు 14 రకాల వస్తువులపైన జిఎస్టీ 5 శాతం విధించటం దారుణమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినపుడు రూ.450 వున్న ఎల్.పి.జి. గ్యాస్ సిలిండర్ నేడు 1150 రూ.లకు పెంచడంతో సామాన్యుల నడ్డి విరిగినదన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు పెరగడంతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని అన్నారు. 88 శాతం వున్న పేదలను మరచి 12 శాతం వున్న కార్పొరేట్లకు మోడీ ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎల్.పి.జి. సిలిండర్ ధరల కారణంగా ప్రజల బతుకు అత్యంత దయనీయంగా మారిందని, దీనికి తోడు ఇప్పుడు ఆహార పదార్థాలపైన జిఎస్టీ విధించటం ప్రజల జీవన స్థితిగతుల్ని మరింత దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 75 ఏండ్లలో ఆహార పదార్థాలపై ఎన్నడూ పన్నులు విధంచలేదన్నారు. నిత్యావసరాల్కెన బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, పనీర్, మాంసం, చేపలు, బెల్లంపై పన్నులు వేయడం ఇదే మొదటిసారని అన్నారు. అన్ని రకాల వస్తువులపైన జిఎస్టీని విధించటం మోడీ దివాళాకోరు విధానాలకు నిదర్శనమని విమర్శించారు. జిఎస్టీని రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసరావు, దొంగల తిరుపతిరావు, నవీన్‌రెడ్డి, జబ్బార్, ప్రకాష్, పి.రమ్య, జిల్లా నాయకులు నర్రా రమేష్, యస్‌కె.మీరా, పగడాల నాగేశ్వరరావు, కె.అమరావతి, ఖమ్మం 3టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, 2టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు.