Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద బాధితుల ఆపన్న హస్తం కోసం
- ఔదార్యాన్ని చాటుతున్న స్థానికులు
నవతెలంగాణ-భద్రాచలం
జల ''ప్రళయం''తో జన''హృదయం'' చెదిరింది. పురిటిగడ్డ తల్లడిల్లింది. ప్రకృతి వైపరీత్యం విషాదాన్ని మిగిల్చింది. రెక్కలోడ్చిన కష్టం కన్నీళ్ల పాలైంది. ఎటు చూసినా ఆర్తనాథాలే. ఏ నోట విన్నా వరద బాధలే. కష్టమేదైనా పాలుపంచుకునే ధర్మపురం భద్రగిరి పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా సంచరించిన పుణ్య ధామం. భద్రాచలంలో సమాజసేవ తమ జీవిత లక్ష్యంగా కొందరు సేవలందిస్తున్నారు. ఆ కోవకు చెందినటువంటి వారిలో ప్రధమంగా పాకాల దుర్గాప్రసాద్ నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే అనేక సేవలందిస్తూ వచ్చిన ఆయన కుటుంబం తాజాగా... భద్రాచలం వరదలకు అతలాకుతలమైన స్థానికులను ఆదుకునేందుకు సేవ్ భద్రాద్రి పేరిట మరో మారు ముందుకు వచ్చారు.
సేవ్ భద్రాద్రి పేరుతో సేవకై
ఇటీవల వచ్చిన వరదలు భద్రాచలం పట్టణాన్ని అతలాకుతలం చేశాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బాధితులు తమ ఇళ్లను విడిచి పెట్టే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. విపరీతమైన నష్టాన్ని చవిచూశారు. ఈ క్రమంలో వరద బాధితులని ఆదుకోవాలని ఆలోచన స్థానికులకు వచ్చింది. ముఖ్యంగా భద్రాచలం ఐటీసీలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న పాకాల దుర్గాప్రసాద్ వీరికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని భావించారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో, గ్రామస్తుల అండతో సేవ్ భద్రాద్రి అని స్థాపించారు. ఈ పేరుతో వరద బాధితుల విరాళాలకు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా విరాళాలు సేకరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా సేవ్ భద్రాద్రికి విరాళాలు అందుతున్నాయి. సోమవారం నాటికి రూ.14 లక్షల 45 వేల విరాళాలు వచ్చాయి. రూ.50 లక్షలు విరాళాలు లక్ష్యంగా ప్రోగ్రామ్ సాగుతోంది. మంగళవారం భద్రాచలంలో విరాళాల సేకరణకై పాదయాత్రను కూడా నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి స్థానికులందరూ కూడా అండగా నిలిచి ముందుకు సాగుతున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన స్పందించే గుణం భద్రాచలం ప్రజలది. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేరళలో వరద బీభత్సం సంభవించినప్పుడు కూడా పాకాల దుర్గాప్రసాద్ నేతృత్వంలో ఆనాడు రూ.24 లక్షలు వసూలు చేసి కేరళ సీఎంకు అందజేశారు. భద్రాచలం ప్రజల ఔదార్యాన్ని చూసి ఆనాడు కేరళ సీఎం ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానికులకు సహకరించాలని సేవ్ భద్రాద్రి పేరిట ముందుకు రావడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విరాళాలు సేకరిస్తున్నారు. పట్టణంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా సహకరించే మంచి గుణం ఉన్న పాకాల దుర్గాప్రసాద్ మరోమారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. విరాళాలన్నీ సేకరించిన తర్వాత వరద బాధితులకు ఉపయోగపడేలా మంచి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా పాకాల దుర్గాప్రసాద్ ''నవ తెలంగాణ''కు తెలిపారు.