Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ హాయాంలోనే మూతపడి మూడేళ్ళు
- వైద్యం అందక ఇతర ప్రాంతాలకు వెళుతున్న రోగులు
- మా పరిధిలో లేదు : జిల్లా వైద్యాధికారి
నవతెలంగాణ-ఇల్లందు
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందుకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు అంటుంటారు. ఇల్లందు హామియోపతి వైద్యశాలను దుస్థితి చూస్తే వారు కార్యక్రమాలు, సభల్లో చేసే ఉపన్యాసాలు ఊకదంపుడు మాటలేనని తేలింది. అన్ని రకాలుగా మభ్యపెట్టడానికే ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటారని వైద్యశాల పరిస్ధితులే ప్రజలకు తెలిసేటట్లుగా చేశాయి. కనీస వైద్యానికే నోచుకోలేనప్పుడు సీఎం కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రజలంటున్నారు. జిల్లాలో మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఇల్లందు. రెండున్నర దశాబ్దాల కాలం క్రితం హామియోవైద్యశాల ఏర్పాటయింది. నిరాటకంగా కొనసాగిన హామియో వైద్యశాల మూతపడింది. ఎంఎల్ఏ హరిప్రియ పదవి చేపట్టిన యేడాదికే ఇల్లందు హామియోపతి వైద్యశాల మూతపడింది. మూడేళ్ళు పూర్తి కావస్తోంది. ఎందుకు మూతపడిందని ఆరాతీస్తే వైద్యులు, ఫార్మసిస్ట్, కాంపౌండర్లు లేరని తెలిసింది. దీంతో హామియోపతి వైద్యశాలకు తాళం వేశారు. 2019లో హౌమియోపతి వైద్యులు డా.కృష్ణ బదిలీపై ముదిగొండ వెళ్లారు. ఆయన స్ధానంలో మరో డాక్టర్ను ప్రభుత్వం నియమించలేదు. వైద్యులు లేకుండానే ఫార్మసిస్ట్, కాంపౌండర్తో యేడాదికిపైగా కొనసాగింది. అనంతరం 2020లో ఫార్మసిస్ట్ మధిర బదిలీ అయ్యారు. 6 నెలలకు ఉన్న కాంపౌండర్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. దీంతో వైద్యశాలకు తాళం వేశారు. మందులు, డ్రాప్స్, దుబ్బాధూళిపట్టి పనికిరాకుండా పోతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలోనే ఒక పక్కన రెండు గదుల్లో హామియోపతి వైద్యశాల ఉంది. ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్బంలో ఎంఎల్ఏ హరిప్రియ, జిల్లా వైద్యాధికారులు హామియోపతి వైద్యశాల వైపు కన్నెత్తి చూడకపోడం, పట్టించుకోకపోవడం బాధాకరమని రోగులు, ప్రజలు అంటున్నారు.
వైద్యం అందక ఇతర ప్రాంతాలకు వెళుతున్న రోగులు
మొండి వ్యాధులకు హామియోపతి వైద్యమే దిక్కు
అనేక దీర్ఘకాలిక, మొండి రోగాలకు హామియోపతి వైద్యమే దిక్కు. రెండు దశాబ్దాల కాలంగా ఇల్లందులో హామియోపతి వైద్యశాల కొనసాగింది. రోజులకు 50 మంది వరకు రోగులు వచ్చేవారు. అనేక మంది రోగులు ఆయాసం, ఉబ్బసం, పుళ్ళు, దురదలు, జలుబు, తలనొప్పి, ఫైల్స్, స్త్రీ సంబంధ వ్యాధులు, చర్మ రోగాలలకు మందుల కొరకు హామియోపతి వైద్యశాలకు వచ్చేవారు. వైద్యునితో పరీక్షలు చేయించుకుని వారం, 15 రోజులు, కొందరికి నెలకు సరిపడా మందులు ఇచ్చేవారు. ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్లు, పత్తెం ఉండదు. ఇలా ఎన్నో మొండి వ్యాధులకు హామియోపతి మందులు అద్భుతంగా పనిచేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యశాల మూతపడటంతో వైద్యం అందక రోగులు గార్ల, కొత్తగూడెం, ఖమ్మం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎంఎల్ఏ స్పందించి పోస్టులు మంజూరు చేసి వైద్యశాలను తెరిపించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
మా పరిధిలో లేదు
హామియో వైద్యశాల మూతపడ్డ సమస్యపై జిల్లా వైద్యాధికారి డా.దయానంద స్వామిని నవతెలంగాణ విరణ కోరగా స్పందించారు. మా పరిధిలో లేదన్నారు. ఆయుష్మాన్ శాఖకు చెందినదని తెలిపారు. వరంగల్లో ఆయూష్ శాఖ ఆర్జెడి కంట్రోల్లో హామియోపతి వైద్యశాలు పనిచేస్తాయని తెలిపారు. పోస్టులు భర్తీ, వైద్యశాల తెరవడం వారి పరిధిలోని అంశం అన్నారు.
: జిల్లా వైద్యులు దయానందస్వామి