Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లంపాడులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 48 గంటల నిరసనకు సిద్ధమవ్వటం హర్షణీయం...
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
గ్రామాలే ఉద్యమ కేంద్రాలుగా పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. మండలంలోని తల్లంపాడు గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన, గ్రామ సమస్యల పరిష్కారనికై జులై 29, 30 తేదీలలో నిర్వహించే 48 గంటల నిరసన దీక్ష పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ తల్లంపాడు గ్రామ శాఖకు జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలిపారు. ప్రతి గ్రామ శాఖ తమ గ్రామంలోని సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు, నిరసనలు తెలియజేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలవుతున్న తల్లంపాడు గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయన్నారు. గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్ళు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం హర్షణీయమన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా తలంపాడు సమస్యలపై దృష్టి సారించి గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సాధనకై తల్లంపాడు నుంచి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన ఘనత సీపీఎం తల్లంపాడు గ్రామ శాఖకు దక్కుతుందన్నారు. ఈ దీక్షకు గ్రామంలోని ప్రతి ఒక్కరు కుల, మత, పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరరావు, డాక్టర్ రంగారావు, శాఖ కార్యదర్శి పల్లె శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ యామిని ఉపేందర్, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు వట్టికోట నరేష్, గుడిబోయిన అరవింద్ పాల్గొన్నారు.