Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రత్యేకమైన కార్యచరణ రూపొందించి అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల విద్యను పటిష్ట పరచడానికి ప్రత్యేకమైన రిసోర్స్ పర్సన్లను నియమించడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లో విద్యకి సంబంధించిన అంశాలే కాక, పిల్లలకు అందిస్తున్న వసతి సౌకర్యాల గురించి రిసోర్స్ పర్సన్లు పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి శనివారం నాటికి తనకు అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఆశ్రమం పాఠశాలల్లో ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీషు బోధనకు సంబంధించిన సాధన పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని వాటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. మీరు అందించే రిపోర్టును బట్టి పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని ప్రతి సోమవారం సంబంధిత హెచ్ఎంలతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరుగుతుందని నివేదికలలో ఏమైనా తప్పుడు సమాచారం ఉంటే సంబంధిత రిసోర్స్ పర్సన్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, పీఎంఆర్సీ అసిస్టెంట్ ఏసీఎంఓ బావ్ సింగ్, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.