Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సామాజిక బాధ్యత లేదు
- ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందే...
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై కక్షపూరిత దాడులు నిర్వహిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని మైసా కొండయ్య ప్రాంగణంలో( కిన్నెర కళ్యాణ మండపం)లో జరిగిన సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభలను ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈడీ పనిచేయడం లేదన్నారు. అధికారంలో ఉన్న వారి చెప్పుచేతులలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే మహారాష్ట్రలో శివసేన పార్టీని విడదీశాయన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నరేంద్రమోడీకి సాష్టాంగ నమస్కారం చేసే విధంగా ఈడీ దాడులు నిర్వహించిందన్నారు. వరదలకు ఆంధ్ర, తెలంగాణ విభేదాలు లేవన్నారు. భారీ వరదలు కారణంగా తెలుగు ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే కేంద్ర ప్రభుత్వం చేత జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడం ముఖ్యమంత్రుల అసమర్దత అన్నారు. ఆంధ్రాలో విలీనం అయినా ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండు చేశారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. ఆంధ్రా మంత్రులు ఐదు గ్రామపంచాయతీలను అడిగితే భద్రాచలం, హైదారాబాద్ ఆంధ్రాలో కలపమనడం విడ్డూరమన్నారు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడే ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపమని తెలంగాణ మంత్రులు అడగడం విచారకరమన్నారు. భద్రాచలం కరకట్ట 9 అడుగుల ఎత్తు పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు భాగం హేమంతరావు, ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతరామయ్య, మిరియాల రంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు. అయోధ్య చారి, రావులపల్లి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.