Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 12 చివరి తేదీ
- అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోని సింగరేణి లీజు పూర్తయి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో 2014కు పూర్వం నివాసం ఉంటున్న వారి ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం జీఓ-76ను విడుదల చేసిందని, అర్హులైన వారు ఆగస్టు 12 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీఓ-76 విడుదల చేసిందని దాని ప్రకారం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉండి దరఖాస్తు చేసుకోలేనివారికి, దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల రిత్య తిరస్కరణకు గురైన వారికి మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. కొత్తగూడెంలోని సర్వే నెం.141, 142, 143లలోని భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి నామమాత్రం రుసుముతో ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణ చేయనున్నట్లు చెప్పారు. 2 జూన్ 2014 కంటే ముందు ఇళ్లు నిర్మించుకున్న వారు అర్హులని, క్రమ బద్ధీకరణకు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. నేటి వరకు 240 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.ఈ నెల 26వ తేదీతో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయుటకు ముగిసినందున, చాలా మంది చేసుకోవాల్సిన వారున్నారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. నిర్ణీత సమయంలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు 76 ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 7046 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4749 దరఖాస్తులు ఆమోదించామని చెప్పారు.2289 దరఖాస్తులు తిరస్కరించినట్లు చెప్పారు.
ఈ విధంగా చెల్లించాల్సిన రేటు....
పేదలు (బిపిఎల్) కుటుంబాలకు చెందిన వారికి 100 గజాల లోపు ఉచితమని, 100-500 వరకు గజానికి రూ.25లు, 501-1000 వరకు గజానికి వేయ్యి రూపాయలు, వాణిజ్య సముదాయాలకు 500 వరకు గజానికి రూ.100లు, 501-1000 వరకు గజానికి రూ.500లు 1000 గజాలు దాటిన గృహ, వాణిజ్య సముదాయాలకు మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.