Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- కరెంట్ లేక కారు చీకట్లోనే మగ్గుతున్నాం
- ఎమ్మెల్సీ దృష్టికి గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గత పది రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదలతో ముంపునకు గురై సర్వం కోల్పోయిన గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు టీఎస్‌యూటీఎఫ్ అండగా ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముంపు బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షల నిధులు సేకరించి గోదావరి పరివాహక భద్రాద్రి, ములుగు జిల్లాలలో పలు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, వస్తు సామగ్రి అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి వరదలతో ముంపుకు గురై సర్వం కోల్పోయిన గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీ, కాళికా దేవి ఆలయం వద్ద ఉన్న సుమారు వంద కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు, దుస్తులు, వస్తు సామాగ్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదలు జన జీవనాన్ని అతలా కుతలం చేశాయన్నారు. ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 వేలు వెంటనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గంగోలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ముంపు ప్రదేశంలో నిర్మించారని ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న అమరజీవి సున్నం రాజయ్య అధికారుల దృష్టికి తీసుకు పోయిన పట్టించుకోలేదని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నుండి వస్తున్న పప్పులు, ఉప్పులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డబుల్ బెడ్ కాలనీ వాసులు పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకు పోయారు. కరెంట్ లేక రాత్రి కారు చీకట్లో గడుపుతున్నామని, రహదారులు కూడా సరిగా లేవని తెలిపారు. దీంతో ఆయన స్పందిస్తూ ఎమ్మెల్సీగా మీ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు పోతానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కె.జంగయ్య, చావా రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శిలు బి.నర్సింహారావు, జి.సమ్మారావు, బి.రాజు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు బి.కిషోర్ సింగ్, ఎన్ కృష్ణ, జివి.నాగమల్లేశ ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, వాసుదేవరెడ్డి, జి.స్వర్ణజ్యోతితో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, మర్మం చంద్రయ్య, సరియం కోటేశ్వరరావు, యలమంచి వంశీకృష్ణ, సరియం రాజమ్మ, నాయకులు యలమంచి శ్రీనుబాబు, రాయపూడి ఏసురత్నం, గుడ్ల రామ్మోహన్‌రెడ్డి టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఇర్ప అనుసూర్య, సంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
చర్ల : వరద బాధితులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు వితరణ చేయు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత మండల కేంద్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్ యుటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బెండ బోయిన మురళీమోహన్ నివాసంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విపరీతమైన వరదలకు గోదావరి తీర ప్రాంత ప్రజలు నానాఅవస్తులు పడుతున్న తరుణంలో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీన మీసాలు లెక్కపెడుతుందని ఆయన ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేసాయని ఆయన ఆక్షేపించారు. స్కూల్లు తెరిచి 40 రోజులు కావస్తున్న ఇప్పటివరకు 40 శాతం పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21500 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విజయ వ్యవస్థను ప్రతిష్టపరచాల్సి ఉందని దానికి తెలంగాణ ప్రభుత్వం తాత్కారం చేస్తుందని ఆయన నిప్పులు చెరిగారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పనికిరాని శిక్షణా తరగతులు పెట్టి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉపాధ్యాయులు లేని చోట విద్యా వాలంటీర్లు నియమించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక వరద బాధితులకు ఇస్తానన్న 20 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు కూడా సరిగా ఇవ్వలేదని, వరద బాధితులు లబో దిబో అంటుంటే కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరు ఎత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. టీఎస్ యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం వ్యయ ప్రయాసలు కూర్చి ఐక్యంగా వరద బాధితులకు చేస్తున్న సహాయం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. వరద బాధితుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని ప్రదర్శించి తమకు చాతనైనంత సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు.