Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్
- యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో గోదావరి వరద ముంపు గురైన 100 కుటుంబాలకు సోమవారం నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ గోదావరి వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించేలా జిల్లా యంత్రాంగం ప్రధానంగా కలెక్టర్ కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం రూ.పదివేలు వెంటనే వరద బాధితులకు అందించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణం ముంపుకు గురికాకుండా గోదావరి కరకట్టను ఎత్తు పెంచి ఇరువైపులా పొడిగించాలని అన్నారు. గోదావరి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో భర్తీ చేయలేనప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు కే.జంగయ్య, చావా రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబి నర్సారెడ్డి, పట్టణ నాయకులు గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి.సంతోష్ కుమార్, లక్ష్మీకాంత్, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు కుసుమ, యుటిఎఫ్ సీనియర్ నాయకులు పి.లక్ష్మీనా రాయణ, రాజు, తావూరియా, జ్యోతి, సునీత, బండారు శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.