Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రత లేని ప్రభుత్వ భూమి
- భయాందోళనలో విద్యార్ధులు
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని లంకమల్లారం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ ట్రెబల్ వెల్ఫేర్ మహిళల కళాశాల ప్రాంగణంలో ఇష్టా రాజ్యంగా అక్రమ గ్రావెల్ తోలకాలు నిర్వహిస్తున్నారు. గుట్టమల్లారం, లంకమల్లారం అధికార ప్రతినిధులు గ్రావెల్ అక్రమదారులకు కొమ్ముకాస్తున్నారు. రేయింబవళ్లు హాద్దు అదుపు లేకుండా జేసిబితో అక్రమంగా గ్రావెల్ తోడేస్తున్నారు. ప్రభుత్వ భూములలో అక్రమ గ్రావెల్ ద్వారా లక్షాలాది రూపాయాలను సంపాదిస్తున్నారు. మహిళా కళాశాల చుట్టూ ఉన్న గుట్టను తోడడం వలన విద్యార్దులకు రక్షణ లేకుండా పోతుంది. అక్రమార్కుల మాటునా కొందరు కళాశాలల్లోకి చొరబడి విద్యార్ధులకు ఆటంకం కల్గిస్తున్నారు. జేసిబి, ట్రాక్టర్ల మోతతో విద్యార్దుల చదువుకు ఆటంకం కలుగుతుంది. కళాశాలకు సరైన రహదారి లేకపోవడం వలన విద్యార్ధులు రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెల్లాలంటే విద్యార్దులు, సిబ్బంది భయపడుతున్నారు. గ్రావెల్ తవ్వేవారు, తోలకాలు నిర్వహించేవారు మద్యం మత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలను నడపడం వలన ప్రమాదం ఎటు నుండి వస్తుందోనని గుట్టమల్లారం, లంకమల్లారం ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రెవెన్యూ సిబ్బంది, మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి వెళ్ళినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చేతివాటం ద్వారా మాముళ్లు ముట్టడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రావెల్ తోలకాలను ఆపాలని, కళాశాల భవనానికి రక్షణ కల్పించాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నారు.