Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె తప్పదు : జేఏసీ హెచ్చరిక
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం తక్షణమే వేతనాల పెంపుదల, జేఏసీ సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 8వ తేదీన లేబర్ కమిషనర్ సమక్షంలో జరగనున్న చర్చలలో పరిష్కారానికి సిద్ధపడాలని, యాజమాన్యం నిర్లక్ష్యంగా, మొండిగా వ్యవహరిస్తే ఈ నెల 8వ తేదీ తర్వాత ఎప్పటి నుండైనా నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధం కావాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఆవేశాన్ని సింగరేణి యాజమాన్యం చవిచూడాల్సి వస్తుందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. సోమవారం కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం ఎల్ విశ్వనాథం అధ్యక్షతన జరిగినది. గత ఏడు నెలల నుండి సింగరేణి యాజమాన్యం, సెంట్రల్ లేబర్ అధికారులు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత తదితర సమస్యల విషయంలో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన యాజమాన్యం నేడు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కానీ సమస్యల పరిష్కారానికి కానీ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం పట్ల జేఏసీ తీవ్రమైన అసంతృప్త్తిని వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన చర్చలలో లేబర్ డిపార్ట్మెంట్ కానీ సింగరేణి యాజమాన్యం గాని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని, వేతనాలను పెంచుతామని ఇతర సమస్యలను కూడా ఏప్రిల్ 19వ తేదీ లోగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకమైన హామీని ఇచ్చి నేడు ఆ హామీలు అమలు విషయంలో కానీ, సమస్యల పరిష్కారంలో కానీ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ఆగస్టు 8వ తేదీ తర్వాత సింగరేణి వ్యాప్తంగా దశల వారి పోరాటాలను నిర్వహించి నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కాంట్రాక్టు కార్మికులు సంసిద్ధులుగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, యర్రగాని కృష్ణయ్య, కాలం నాగభూషణం, ఎస్కె.యాకూబ్ షావలి, డి.బ్రహ్మానందం, ఇనపనూరి నాగేశ్వరరావు, జి.రమేష్, వై.ఆంజనేయులు, డి.ప్రసాదు, డి.నిర్మల, కె.సురేందర్, పి.రామచందర్, జి.నాగేశ్వరరావు, ఏం.మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.