Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంగా పాసు పుస్తకాలు
- అఖిలపక్ష నాయకుల డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
రెవెన్యూ శాఖ నుండి అక్రమంగా పాస్ పుస్తకాలు పొంది, ప్రభుత్వాన్ని మోసం చేసి రైతు బంధు లబ్ధి పొందుతున్న వేములపల్లి రమేష్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సొమ్మును వెంటనే రికవరీ చేయాలని చుంచుపల్లి మండల అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక బైపాస్ రోడ్డులో గల కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. చుంచుపల్లి మండలం, విద్యా నగర్ కాలనీలో అక్రమంగా రైతు బంధు లక్షల రూపాయలు పొందుతున్న వేములపల్లి రమేష్ వివరాలు వెల్లడించారు. సర్వే నంబర్ 32/1, 32/2,32/3, 32/4/1, 35/2 ఆ, 35/3అ తదితర నెంబర్లలో ఉన్న సుమారు 16.24 ఎకరాల భూమి తనదేనంటు అక్రమంగా పట్టాదార్ పాస్ పుస్తకం పొందారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు అతనికి అక్రమంగా పాస్ పుస్తకాల జారీ చేయడాన్ని ఘాటుగా విమర్శించారు. అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందన్నారు. 2018 పూర్వమే తన తండ్రి వేములపల్లి భాస్కర్ రావు తనకున్న కొంత స్థలాన్ని ఇతరులకు విక్రయించారని తెలిపారు. అమ్మకం చేసిన స్థలం పేరుతో 2018 తర్వాత వేములపల్లి రమేష్ అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకం పొందారన్నారు. తన పేరుతో అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకం సంపాదించి 16.24 ఎకరాలలో వివిధ పంట సాగు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఏదాదికి రూ.1.68 వేలు అక్రమంగా కాజేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాలను సంబంధిత అధికారులను నుండి సాంపాదించినట్లు, సాక్షాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది రూ.1.68వేలు తన ఎస్బీఐ బ్యాంకు ఖాతానుండి పొందుతున్న వివరాలు తెలిపారు. ఇంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు గుడ్డిగా ఉండడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. విక్రయించిన భూమి నాదే అంటూ రమేష్ పలువురు దగ్గరకు వెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బాదితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదకుండా పోయిందన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుండి లక్షలాది రూపాయలు పొందుతున్న వేములపల్లి రమేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అక్రమంగా పొందిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దుచేయాలని లేనిపక్షంలో బాదితులతో కలిసి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విలేఖర్ల సమావేశంలో అఖిలపక్షం నాయకులు దుర్గరాశి వెంకన్న, పేర బోయిన నరసింహారావు, బలగం శ్రీధర్, ఎలక రామచందర్, బొమ్మిడి మల్లికార్జున్, సొప్పరి శివ, తదితరులు పాల్గొన్నారు.