Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం జూన్ నెలలో విడుదల చేసిన కనీస వేతనాలు జీవో ప్రకారం పెరిగిన వేతనాలను సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేట్లోని బాబు క్యాంపు, బర్మా క్యాంపు, ఆస్పటల్ ఏరియా, ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల, టేకులపల్లి కోయగూడెం ఓసిలలో జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అరకొర వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు కాకుండా సింగరేణి యాజమాన్యం ఎమ్మెల్యేలకు ఇతర అవసరాలకు నిధులను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాదులో జరిగే ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకల శ్రీనివాస్, సిఐటియు నాయకులు మల్సూర్, విజరు కృష్ణ, సంజీవరావు, బాలాజీ, రమణ, అప్పారావు, పద్మ, వెంకటస్వామి, వినోదు, మరియమ్మ, రామారావు, కమలాకర్, నరసింహారావు, రమేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.