Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల పట్ల ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి
- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేదా ?
నవతెలంగాణ-బోనకల్
విధులు బారేడు. కానీ జీతం మాత్రం మూరెడు. చేయించుకునేది మాత్రం వెట్టి చాకిరీ. ఏ అధికారి వచ్చిన సమాచారం కోసం మొట్టమొదటగా అడిగేది వారినే. గ్రామస్థాయిలో ఏ సమాచారం, విచారణ కావాలన్నా వారిపైనే ఆధారపడవలసి ఉంది. కానీ వారి సమస్యల పట్ల ప్రభుత్వ మాత్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి. ఇది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల దీనగాధ.
ప్రభుత్వం గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ)తో 64 రకాల పనులు చేయిస్తోంది. గ్రామంలో ప్రధాన ప్రభుత్వ ప్రతినిధి గ్రామ రెవెన్యూ అసిస్టెంట్. ఆయన లేకుండా గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే పరిస్థితి కూడా లేదు. గ్రామస్థాయిలో ఏ సమాచారం కావాలన్నా వీరు చెప్పాల్సిందే. మండల పరిషత్తు కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, విద్యుత్ కార్యాలయం, నీటిపారుదల శాఖ, వైద్య, విద్య రంగాల అధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖకు అవసరమైన ఉద్యోగి వీఆర్ఏ. సాధారణంగా ఏ శాఖ పరిధిలో సిబ్బంది ఆ శాఖ పై అధికారులకు మాత్రమే లోబడి విధులు నిర్వహిస్తారు. కానీ వీఆర్ఏలు మాత్రం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు లోబడి పని చేయవలసిందే. వారు అడిగే ప్రతి సమాచారం ఇవ్వవలసి ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వీఆర్ఏల ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జులై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె బాట పట్టారు. తహసిల్దార్ కార్యాలయాల ముందు దీక్షలు చేపట్టారు. సోమవారానికి 8 రోజులు అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
సీఎం కేసీఆర్ 20 ఫిబ్రవరి 2017న వీఆర్ఏలందరికీ ప్రగతి భవనలో మూడు ప్రధానమైన హామీలను ఇచ్చారు. వీఆర్ఏలందరికీ పేస్కేల్ అమలు చేస్తానని, అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ పదోన్నతులు, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సాక్షాత్తు ప్రకటించారు. అదేవిధంగా 9 సెప్టెంబర్ 2020 న సాక్షాత్తు శాసనసభలో, మరల మార్చి 2020న ఇదే విధంగా శాసనసభలో ప్రకటించారు. హామీ చేసి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. స్పందన రాకపోవడంతో కడుపు మండిన వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. వీరి సమ్మెకు ప్రధాన రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. వీఆర్ఏలకు నెలకు రూ.10,500 ప్రభుత్వం వేతనం చెల్లిస్తుంది. వీటిలో 4 నుంచి 5వేలు పెట్రోల్ కే ఖర్చు అవుతున్నాయని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి : పులుసు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ ల సంఘం జిల్లా కార్యదర్శి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను బేషరతుగా యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేయాలి. 2017 నుంచి ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూశాము. కానీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన లేదు. దీంతో మరో మార్గం లేకనే మా సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె బాట పట్టాం. అరకొర వేతనంతో కుటుంబ పోషణ ఎంతో భారంగా మారింది.