Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే చివరి జాబితా సవరణ
- రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ జాబితా సవరణలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి జాబితా సవరణ అని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా కీలకమన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఫొటో ఓటర్ల జాబితాల సవరణలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులు ఆగస్టు-2022 నుండి అమలులోకి వస్తాయన్నారు. దీనిపై అధికారులు, సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించామన్నారు. బీఫారం-6 నూతన ఓటర్ల నమోదు కోసం మాత్రమే వినియోగించాలన్నారు. ఫారం-7 ద్వారా ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయాల్సిందిగా సూచించారు. ఫారం- 3 ద్వారా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో నివాసం మార్పు, నమోదు చేసిన వివరాల సవరణ, కొత్త ఓటరు ఫొటో గుర్తింపు కార్డు జారీ కోసం వైకల్యం ఉన్న వ్యక్తిగా /ఓటరుగా గుర్తించడానికి అభ్యర్ధన వంటి వాటి కోసం ఫారం-8 ఉపయోగించాలని తెలిపారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్- 6బి ని ప్రవేశపెట్టామని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, ఓటరు జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు, తమ పేరు సమోదును ధృవీకరించుకునేందుకు ఆధార్ నంబర్ ద్వారా తెలిపాలన్నారు. ప్రతి పౌరునికి ఒకే ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉండేందుకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్చందమన్నారు. ఓటర్లు ఆధార్ నంబర్ ను అందించలేకపోతే ఫారం-6బి లో పేర్కొన్న ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించవచ్చన్నారు. ఫారం-6బి ధరఖాస్తు వెబ్సైట్లు, యాప్‌లలో నిబంధనలను అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యు.ఐ.డి.ఐ.ఎ. తో రిజిస్టర్ మొబైల్ నంబర్ ఓ.టి.పి.ని ఉపయోగించి ఆధార్ ను ప్రామాణీకరించుకోవచ్చని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నుండి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలన్నారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకునే వారున్నారు. ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. 01.01.2023 నాటికి 18 సంవత్సరముల వయస్సు నిండే పౌరులను ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితాపై ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్ నిర్వహించి, నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 8వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. డిసెంబర్ 26వ తేదీ లోగా అభ్యంతరాలను, ఓటర్ క్షయిమ్స్ పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023న ఓటర్ల జాబితా తుది ప్రచురణ తయారు చేస్తారని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రతినిధులు ఓటరు జాబితా తయారీలో అధికారులకు సహకరించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా తయారు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డిఆర్వో శిరీష, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.