Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస, రైతుసంఘం, సీఐటీయు
- ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం
వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాలను అమలు చేయాలని వ్యకాస, రైతుసంఘం, సీఐటీయు నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, కళ్యాణ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, అర్హులైన పేదలం దరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల పని గంటలను పెంచి శ్రమ దోపిడీకి పాల్పడుతుందని వెంటనే కార్మిక కోడ్లను రద్దు చేయాలని, ఆహార భద్రత చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి పనికి రెండు లక్షల 60 వేల కోట్లు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా పనిని ప్రవేశపెట్టాలని కోరారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన పోడు సాగుదారులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు రక్షణ కల్పించి కౌలు తగ్గించాలని, కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు కూలి బంధు, కూలి బీమా పథకం ప్రవేశ పెట్టాలని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కార్యక్ర మంలో ఆయా సంఘాల జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, తుమ్మ విష్ణువర్ధన్, సిఐటియు జిల్లా నాయకులు వై.విక్రం రైతు సంఘం నాయకులు తాతా భాస్కర్రావు, షేక్ మేరా వరప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తాళ్లపల్లి కృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా సంఘం నాయకులు పెన్నంటి రమ్య, అమరావతి, ఐద్వా జిల్లా నాయకురాలు మెరుగు రమణ, సిఐటియు నాయకులు భూక్యాశ్రీను, బండారు యాకయ్య, కాంపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.