Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ రఘునాథపాలెం
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఖమ్మం మునిసిపల్ పరిధిలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జిప్లస్ 2లో చేపడుతున్న 96 ఇండ్లను ఆయన పరిశీలించారు. 2 బ్లాకుల్లో 48 ఇండ్ల నిర్మాణం పూర్తగు దశలో ఉన్నట్లు, చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. మిగులు ఇండ్లలో లేబర్ని పెంచాలని ఆయన సూచించారు. అనంతరం కేసీఆర్ కాలనిలో నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందజేసిన గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం మల్లెమడుగు గ్రామంలో 8 బ్లాకుల్లో నిర్మిస్తున్న 192 గృహ నిర్మాణాలు ఆయన తనిఖీ చేశారు. బ్లాకుకు 24 చొప్పున 5 బ్లాకుల్లో నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా 3 బ్లాకుల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. డ్రైనేజీ పనులు నడుస్తున్నట్లు, ఆగస్టు నెలాఖరులోగా సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. సానిటరీ, విద్యుత్ సంబంధ సామాగ్రి పూర్తిగా అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనుల పూర్తికి వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, పనుల పురోగతిపై రోజువారీ సమీక్షలు చేయాలని ఆయన అన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ తానాజి, డిఇ రాజు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.
పిల్లలతో మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాధమిక పాఠశాల పిల్లలతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో ఎలా చదువుతున్నది, సౌకర్యాలు ఎలావున్నవి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో మమేకమై వారితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. ప్రాధమిక పాఠశాలలో ప్రహారీగోడ, కిచెన్ షెడ్, రూఫ్ స్లాబ్ సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులు, ఫ్లోరింగ్, విద్యుత్, త్రాగునీటికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి, గ్రుడ్ల పరిమాణం, బరువు పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. టెలివిజన్ ఉపయోగంలో లేకపోవడం గమనించి, ఎందుకు వాడడం లేదని అడగగా, పనిచేయడం లేదని సమాధానం రాగా, కలెక్టర్ రిమోట్ తో టివిని పరిశీలించి, సెట్టింగులు చేసి చూపించారు. టివిని ఏ విధంగా వాడాలో చూపించారు. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ముందుగా ఏర్పాటుచేయాలని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. అనంతరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. డైనింగ్ హాల్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పురోగతిని చూశారు. ఆగస్టు 15 లోగా కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యుత్, ఫ్లోరింగ్, ప్యాచ్ వర్క్ పనులు వేగం చేయాలన్నారు. పనుల పురోగతికి సంబంధించి పురోగతిని ఫొటోలతో పాటు, చేపట్టక ముందు, పూర్తి తర్వాత ఫోటోలు పోస్ట్ చేయాలన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంలో 60వ డివిజన్ కార్పొరేటర్ నిరంజన్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్ ఉన్నారు.